- 18 నెలల బాబును చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన కుక్కలు
- తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ మృతి
- హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఘటన
జవహర్ నగర్, వెలుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల బాలుడిని వీధికుక్కలు ఎత్తుకెళ్లి, తీవ్రంగా దాడిచేయడంతో శిశువు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ పీఎస్పరిధిలో జరిగింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్, లక్ష్మి దంపతుల కొడుకు నిహాన్ (18 నెలలు). వీరంతా కలిసి నెల కింద జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగా.. నిహాన్ ఆడుకుంటూ బయటికి వచ్చాడు. అక్కడే తిరుగుతున్న వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడిచేశాయి.
ఓ కుక్క నోటితో బాలుడిని పట్టుకుని సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లింది. అక్కడ మరోసారి కుక్కలన్నీ దాడి చేశాయి. దాదాపు 15 నిమిషాల తర్వాత నిహాన్కనిపించడంతో కుటుంబ సభ్యులంతా బయటికి పరుగులు తీశారు. చెట్ల పొదల్లో కుక్కలన్నీ గుంపుగా ఉండడంతో అక్కడికి వెళ్లి చూడగా, తీవ్ర గాయాలతో బాలుడు పడి ఉన్నాడు. బాలుడి తలపై జుట్టును పీకేసి దాడిచేసినట్లు గుర్తించారు. శరీరమంతా గాయాలు, రక్తం కారుతుండడంతో వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.