నేపాల్​లో కూలిన విమానం .. 18 మంది మృతి

నేపాల్​లో కూలిన విమానం .. 18 మంది మృతి
  • ఖట్మాండులోని త్రిభువన్ ఎయిర్​పోర్టులో ఘటన
  • రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం టేకాఫ్
  • పొఖారా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదం
  • నిమిషం వ్యవధిలోనే రన్ వే పక్కన గొయ్యిలోకి
  • రన్​వే చిన్నగా ఉండడమే ప్రమాదానికి కారణం!

ఖట్మాండు: నేపాల్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం.. రన్​వే పక్కన ఉన్న గొయ్యిలో కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృతుల్లో నాలుగేండ్ల బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ప్రమాదం జరిగిన టైమ్​లో విమానంలో మొత్తం 19 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు క్రూ మెంబర్లు కాగా, మిగిలిన వాళ్లంతా టెక్నికల్ స్టాఫ్ అని వివరించారు. పైలెట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని.. ఖట్మాండులోని హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శౌర్య ఎయిర్​లైన్స్​కు చెందిన బాంబార్డియర్‌‌ సీఆర్‌‌జే 200 విమానం.. రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని విమానయాన శాఖ అధికారులు తెలిపారు.

స్పాట్​లోనే 15 మంది మృతి

శౌర్య ఎయిర్​లైన్స్​కు చెందిన బాంబార్డియన్ సీఆర్​జే 200 విమానం 2003లో తయారైంది. సుమారు 20 ఏండ్లుగా సేవలు అందిస్తున్నది. ఈ ప్లేన్​లో మొత్తం 50 మంది కూర్చోవచ్చు. మెయింటెనెన్స్ లో భాగంగా బుధవారం ఉదయం త్రిభువన్ ఎయిర్​పోర్టులోని రెండో నంబర్ రన్ వే పై నుంచి 19 మందితో పొఖారాకు టేకాఫ్ అయింది. కొన్ని క్షణాల్లోనే విమానంపై పైలెట్ నియంత్రణ కోల్పోవడంతో రన్ వే నుంచి జారిపోయి పక్కనే ఉన్న పెద్ద గొయ్యిలోకి పడిపోయింది.

దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన పైలెట్​ కెప్టెన్ మనీశ్ రత్న శఖ్యను విమానం నుంచి బయటకు తీసి, హాస్పిటల్​కు తరలించారు. కో పైలెట్ ఎస్.కటువాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఫైర్​ఫైటర్స్, ఎయిర్​లైన్స్ సిబ్బంది విమాన శిథిలాలు తొలగిస్తున్నారు. కాగా, 15 మంది స్పాట్​లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన ముగ్గురు హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలాన్ని ప్రధాని కేపీ శర్మ ఓలీ, హోంమినిస్టర్ రమేశ్ లేఖ్ పరిశీలించారు. గత ఏడాది యతి ఎయిర్‌‌లైన్స్‌‌ విమానం పొఖారా ఎయిర్​పోర్టు వద్ద కుప్పకూలిన ఘటనలో 72 మంది చనిపోయారు.

ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి

విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. శౌర్య ఎయిర్​లైన్స్ టెక్నీషియన్ మనురాజ్ శర్మ ఫ్యామిలీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని ఏవియేషన్ అథారిటీ అధికారులు ప్రకటించారు. మనురాజ్ శర్మ భార్య ప్రిజా ఖటివాడా, వాళ్ల నాలుగేండ్ల కొడుకు అధిరాజ్ శర్మ చనిపోయారు. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, వాటర్ రీసోర్స్, ఇరిగేషన్​లో ప్రిజా ఖటివాడా.. అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్​గా పని చేస్తుంది. కాగా, ప్లేన్ క్రాష్​లో చనిపోయిన వారంతా శౌర్య ఎయిర్​లైన్స్ టెక్నికల్ స్టాఫ్ అని తొలుత అధికారులు ప్రకటించారు. తర్వాత ఈ ముగ్గురిని 
ప్యాసింజర్లు అని అనౌన్స్ చేశారు.

విమాన ప్రమాదం బాధాకరం: ప్రధాని కేపీ శర్మ ఓలీ

ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్లేన్ క్రాష్ బాధాకరమన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకు సూచించినట్లు వివరించారు. ఘటనా స్థలాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.

‘టేబుల్ టాప్’ రన్​వేల కారణంగానే ప్రమాదాలు

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రన్‌‌వేలు నేపాల్‌‌లో ఉన్నాయి. ‘టేబుల్ టాప్’ రన్​వేల కారణంగా ఎక్స్​పీరియన్స్ ఉన్న పైలెట్లు కూడా ఇబ్బందిపడ్తుంటారు. సముద్ర మట్టానికి ఎత్తులో.. కొండల మధ్య ఉన్న రన్​వేలనే ‘టేబుల్ టాప్’ రన్​వేలు అంటారు. ఈ రన్‌‌వేలు చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి ఒకవైపు లేదా రెండు వైపులా లోయలు ఉంటాయి. ఇక్కడ టేకాఫ్‌‌, ల్యాండింగ్‌‌ చేసేటప్పుడు పైలట్‌‌ అలర్ట్​గా ఉండాలి. 

ఏ చిన్న పొరపాటు చేసినా విమానం ఓవర్‌‌షూట్‌‌ అయి లోయలోకి దూసుకెళ్తుంది. నేపాల్​లో తరచూ విమాన ప్రమాదాలకు ‘టేబుల్ టాప్’ రన్​వేలే కారణం. ఇలాంటి రన్​వేలు నేపాల్​లో ఏడు ఉన్నాయి. త్రిభువన్ ఎయిర్​పోర్టు కూడా సముద్ర మట్టానికి చాలా ఎత్తులో పర్వతాల మధ్యలో ఉంది. ఇక్కడ రన్‌‌వే చాలా చిన్నది. దీని పొడవు కేవలం 527 మీటర్లు మాత్రమే. కాగా, మన ఇండియాలో అయితే ఐదు ‘టేబుల్ టాప్’ రన్​వేలు ఉన్నాయి. సిమ్లా (హిమాచల్‌‌ ప్రదేశ్‌‌), కొయ్‌‌కోడ్‌‌ (కేరళ), మంగళూరు (కర్నాటక), లెంగ్‌‌పుయ్‌‌ (మిజోరం), పాక్యాంగ్‌‌ (సిక్కిం) రన్‌‌వేలు ఈ తరహావే.