
- బసంత్కంటా జిల్లాలో ఘోరం
- పేలుడు ధాటికి కూలిన పైకప్పు
- శిథిలాల కింద మరికొంత మంది
- కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం
పాలన్పూర్(గుజరాత్): పటాకుల గోడౌన్లో సంభవించిన భారీ పేలుడు కారణంగా 18 మంది చనిపోయారు. పేలుడు ధాటికి గోడౌన్ పైకప్పు కూలిపోయింది. దీంతో శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని బసంత్కంటా జిల్లా దీసా టౌన్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవాళ్లుగా గుర్తించారు. గోడౌన్లో పని చేస్తూ.. పక్కనే నివాసం ఉంటున్న వారి కుటుంబ సభ్యులు కూడా ప్రమాదానికి గురయ్యారు. అయితే, గోడౌన్లో పటాకులు తయారు చేస్తున్నట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. క్రాకర్స్‌ను ఇక్కడ స్టోర్ చేసి ఉంచినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ధున్వా రోడ్లో ఉన్న ఈ గోడౌన్లో బాయిలర్ పేలడంతోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి శిథిలాలు తొలగిస్తున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు సీఎం భూపేంద్ర పటేల్ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందజేసేందుకు నిర్ణయించారు.
గుజరాత్ అధికారులతో మాట్లాడిన: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
మృతుల కుటుంబాలకు అండగా ఉంటామ ని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భరోసా ఇచ్చారు. గుజరాత్ అధికారులతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా గుజరాత్ సర్కార్‌ను కోరినట్లు తెలిపారు.