భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 18 మంది గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు ఉప్పొంగడంతో మోరంచపల్లికి చెందిన గొర్రె ఒదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, మహాలక్ష్మి, సరోజన వాగులో కొట్టుకుపోయారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూరుగుపేట గ్రామంలోని మారేడుకొండ చెరువుకు గండి పడడంతో వరద ఉధృతికి బూరుగుపేట గ్రామానికి చెందిన బండ్ల సారయ్య ఇల్లు కొట్టుకుపోగా ముగ్గురు గల్లంతయ్యారు.
బండ్ల సారయ్య చనిపోగా సారమ్మ, సమ్మక్క కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తున్నది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో దయ్యాల వాగు వరద ఉధృతితో కొండాయి గ్రామానికి చెందిన రశీద్, షరీఫ్, అజ్జు, మహబూబ్ ఖాన్‌తో పాటు మరో ఆరుగురు కొట్టుకుపోయారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం జంపన్నవాగు పొంగి ప్రాజెక్ట్ నగర్ గ్రామాన్ని ముంచెత్తింది.
ALSO READ:ఇండ్లలో మోకాలి లోతు నీళ్లు.. రాత్రంతా జాగారం!
దీంతో ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ గురుకుల విద్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగింది. కాగా, మొట్లగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాజెక్ట్ నగర్ నుంచి గురువారం తీసుకెళ్తుండగా, ముగ్గురూ జంపన్న వాగులో గల్లంతయ్యారు. వీరిలో బాలుడి డెడ్‌బాడీ దొరికింది.