
- బిల్లు ప్రతులను చింపి స్పీకర్ వైపు విసిరిన బీజేపీ ఎమ్మెల్యేలు
- హనీట్రాప్ ఇష్యూపై సీబీఐ విచారణకు డిమాండ్
- 18 మందిని ఆరునెలల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్
బెంగళూరు: ముస్లిం కోటా బిల్లు, హనీట్రాప్ వ్యవహారంపై కర్నాటక అసెంబ్లీ అట్టుడికింది. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి.. ముస్లిం కోటా బిల్లు ప్రతులను చింపేసి.. స్పీకర్ వైపు విసిరారు. దీంతో వారిని మార్షల్స్ బయటకు పంపించేశారు. ఆందోళనకు దిగిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరునెలల పాటు స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టింది.
సామాజిక న్యాయం కోసమే దీన్ని తీసుకువస్తున్నామని తెలిపింది. దీనిపై బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. హనీట్రాప్ వ్యవహారంపై చర్చించకుండా ముస్లిం కోటా బిల్లును తీసుకురావడం ఏమిటని ఆందోళనకు దిగారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు. హనీట్రాప్ ఇష్యూపై చర్చించాల్సిందేనని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కొందరిని కాపాడేందుకే ప్రభుత్వం హనీట్రాప్ వ్యవహారాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రానికి చెందిన దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీట్రాప్‌లో చిక్కుకున్నారని, వారిలో పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఉన్నారని, కొందరు మంత్రులు కూడా ఉన్నారంటూ ఇటీవల కర్నాటక మంత్రి కేఎన్ రాజన్న ప్రస్తావించడం సంచలనంగా మారింది. దీనిపై నిగ్గు తేల్చాలంటూ బీజేపీ సభ్యులు శుక్రవారం సభను అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. ముస్లిం కోటా బిల్లు ప్రతులను చింపి.. స్పీకర్ వైపు విసిరారు. స్పీకర్ డాయస్పైకి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని
మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించేశారు.
హనీట్రాప్ వ్యవహారంపై విచారణ జరిపిస్తం: సిద్ధరామయ్య
ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పార్టీ ఖండించింది. బీజేపీ ఎమ్మెల్యేలు కావాలనే రచ్చ చేస్తున్నారని.. హనీట్రాప్ వ్యవహారంలో నిందితులను తప్పకుండా శిక్షిస్తామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా సరే తమకు కాపాడాలన్న ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్నా ప్రతిపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం ఏమిటని మండిపడ్డారు.
సామాజిక న్యాయం కోసమే ముస్లింలకు కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించి నట్లు చెప్పారు. కాగా, అసెంబ్లీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు గాను 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఖాదర్ సస్పెండ్ చేశారు. ఆరు నెలల పాటు ఇవి అమలులో ఉంటాయని పేర్కొన్నారు.