
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో యూరియా కలిసిన నీళ్లు తాగి 18 గొర్రెలు చనిపోయాయి. గ్రామానికి చెందిన కొమ్ము మల్లేశ్ అనే పాడి రైతు ఉదయం ఎనిమిది గంటలకు తన గొర్రెల మందను మేపేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గొర్రెలకు నీళ్లు తాపేందుకు అదే గ్రామానికి చెందిన కందుల సత్తయ్య పొలం వద్దకు వెళ్లి బోర్ మోటార్ వేశాడు.
ఆ నీళ్లు తాగిన 18 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. విషయం తెలుసుకున్న తాళ్లగురజాల ఎస్సై జి.నరేశ్, మండల పశువైద్యాధికారి పావని ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పొలం వద్ద మోటార్ సమీపంలో మూడు పాత యూరియా బస్తాలు పడి ఉండడాన్ని గమనించారు. మోటార్ ఆన్ చేసిన తర్వాత యూరియా బస్తాలు తడిశాయని, ఆ నీళ్లు తాగడం వల్లే గొర్రెలు చనిపోయాయని పశు వైద్యాధికారి తెలిపారు. గొర్రెల మృతితో సుమారు రూ. 2 లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.