దక్షిణ మధ్య రైల్వేకు..రూ.18వేల కోట్ల ఆమ్దానీ

దక్షిణ మధ్య రైల్వేకు..రూ.18వేల కోట్ల ఆమ్దానీ

హైదరాబాద్, వెలుగు : 2022‌‌ – 23 ఫైనాన్షియల్ ఇయర్​లో రూ.18,973.14 కోట్ల రెవెన్యూ సాధించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. ప్యాసింజర్, సరుకు రవాణాలో కూడా మంచి పనితీరు కనబర్చామన్నారు.  సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.13,051.10 కోట్ల రెవెన్యూ సాధించామన్నారు. 255.59 మిలియన్ల మంది ప్యాసింజర్లను గమ్య స్థానాలకు చేర్చి రూ.5,140.70 కోట్ల ఆమ్దానీ రాబట్టుకున్నామని వివరించారు. కొత్తగా 384.42 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేశామని, 1,016.9 కిలో మీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కంప్లీట్ చేశామని తెలిపారు. 1,743.42 కిలో మీటర్ల ట్రాక్ స్పీడ్ ను గంటకు 130 కి.మీ వేగానికి అప్​గ్రేడ్ చేశామన్నారు. మీటింగ్​లో అడిషనల్ జీఎం ధనుంజయులు, అధికారులు పాల్గొన్నారు.