వారంలో 18 వేల భూకంపాలు

వారంలో 18 వేల భూకంపాలు

యూరోప్‌లోని ఐస్‌లాండ్ దేశం.. సైజులో మన తెలంగాణ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. జనాభా 4 లక్షల మంది కంటే తక్కువే. కానీ ఆ దేశం అగ్ని పర్వతాల పుట్ట. అంతచిన్న దేశంలోనే 30 అగ్ని పర్వతాలు ఉన్నాయి. పేరుకు, చూపుకి మాత్రం ఐస్‌లాండ్. ఆ దేశం కింద తక్కువ లోతులోనే వేల డిగ్రీల వేడితో సలసల కాగే మాగ్మా ఉంది. ఆ మాగ్మా కదిలినప్పుడల్లా భూమి కంపిస్తుంటుంది. అయితే కొన్నేండ్లుగా ఎప్పుడూ లేని రీతిలో గడిచిన ఒక్క వారంలోనే 18 వేల సార్లు భూమి కంపించింది. అయితే వాటిలో ఏ ఒక్కసారి కూడా రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రత దాటలేదు. ప్రకంపనల తీవ్రత పెరిగితే ఎక్కడ అగ్ని పర్వతాలు బద్దలవుతాయోనని ఆ దేశం ఆందోళన చెందుతోంది.

స్‌‌లాండ్‌‌లో గడిచిన కొన్నేండ్లుగా ఎప్పుడూ లేనంతగా భూప్రకంపనలు మొదలయ్యాయి. దేశ రాజధానికి సమీపంలో ఉన్న రేక్‌‌జాన్స్ పెనిన్సులా రీజియన్‌‌లో గడిచిన వారం రోజుల్లోనే 18 వేల సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనల కారణంగా దాదాపు 800 ఏండ్లు నుంచి ఇన్‌‌యాక్టివ్‌‌గా ఉన్న సుంద్‌‌న్యూకగిగరెద్, ఫగ్రడల్స్‌‌ఫెయల్ అనే రెండు అగ్నిపర్వతాలు మళ్లీ యాక్టివ్‌‌గా మారాయి. ఇప్పుడు ఆ రెండు బద్దలయ్యే చాన్స్ ఉందని ఐస్‌‌లాండ్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వీటికి సమీపంలోనే మౌంట్ కైలిర్ సహా ఐదు అగ్ని పర్వతాలు ఉండడం అక్కడి వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మౌంట్ కైలిర్‌‌‌‌ కూడా బద్దలయ్యే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

అగ్ని పర్వతాలు బద్దలయ్యే చాన్స్

గత వారంలో వచ్చిన భూకంపాల్లో ఎక్కువ శాతం రిక్టర్ స్కేలుపై తీవ్రత 3 దాటకపోవడం కొంత మేరకు రిలీఫ్ ఇచ్చే విషయం. గురువారం నాడు అత్యధికంగా 5.6 తీవ్రత నమోదైంది. దీని వల్ల రేక్‌‌జాన్స్ పెనిన్సులా రీజియన్‌‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు, రోడ్లు స్వల్పంగా  డ్యామేజ్ అయ్యాయి. ఈ భూప్రకంపనలు మళ్లీ మళ్లీ రిపీట్ అయితే అగ్ని పర్వతం బద్దలవ్వడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12వ శతాబ్ధం తర్వాత ఫస్ట్‌‌ టైమ్ రేక్‌‌జాన్స్ పెనిన్సులా రీజియన్‌‌లో అగ్ని పర్వతం బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ‘అట్లాంటిక్ సముద్రం, నార్త్ అమెరికా, యూరేషియాలను వేరు చేసే టెక్టానిక్ ప్లేట్‌‌ బౌండరీలో ఉన్న మిడ్ అట్లాంటిక్ రిడ్జ్‌‌లో ఐస్‌‌లాండ్ ఉంది. పైగా ఈ ప్రాంతంలో భారీగా పర్వతాలు ఏర్పడడం, వాటి కింద మాగ్మా తక్కువ లోతులోనే ఉండడంతో ఎక్కువ సంఖ్యలో అగ్ని పర్వతాలు ఏర్పడ్డాయి’ అని యూనివర్సిటీ ఆఫ్ ఐస్‌‌లాండ్ రీసెర్చర్లు చెబుతున్నారు.

ఇలా పేలితే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు

‘ఇన్ని ఎక్కువ సార్లు భూమి కంపించిన తర్వాత అగ్ని పర్వతాలు బద్దలవ్వడం ఒక రకంగా మంచిదే. ఒక్కసారిగా పేలుడు జరిగితే అకాశంలోకి ఉవ్వెత్తున లావా, బూడిద ఎగసి పడుతుంది. ఇలా చాలా సార్లు భూమి కంపించడం ద్వారా లావా పైకి ఎగసి పడకుండా, భూమికి ఆనుకునే పొరల్లో లీకేజీ జరిగే చాన్స్ ఉంది’ అని ఎక్స్‌‌పర్ట్స్ తెలిపారు. లీకేజీలా వాల్కనో ఎరప్షన్ జరిగితే ఎయిర్‌‌‌‌ ట్రావెల్‌‌ సహా ఎవరి లైఫ్‌‌కూ ఇబ్బంది ఉండదన్నారు. ఇలా ఒక్కసారిగా వారం రోజుల్లోనే వేల సార్లు భూప్రకంపనలు రావడానికి కారణాలను కచ్చితంగా చెప్పలేకపోతున్నామని యూనివర్సిటీ ఆఫ్ ఐస్‌‌లాండ్ వాల్కనోలజీ ప్రొఫెసర్ పోర్వల్డర్ పోరార్సన్ అన్నారు. భూమి పైపొరల్లోకి మాగ్మా ఎగసి పడుతుండడమే దీనికి కారణం కావచ్చని అంచనా వేస్తున్నామని, అయితే అది ఎంతపైకి చేరిందనేది గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని, దానిని బట్టి అగ్ని పర్వతం ఎప్పుడు బద్దలవుతుందో ముందే తెలుసుకోవచ్చని చెప్పారు.

ముందు జాగ్రత్తగా ఆరెంజ్ అలర్ట్

వారంలోనే 18 వేల సార్లు భూమి కంపించడంతో ఐస్‌‌లాండ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ దేశం మీదుగా విమానాలు వెళ్లే అన్ని దేశాలకు ఈ సమాచారం అందజేశారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌‌‌‌పోర్టులకు పెనిన్సులా ఏరియాలో ఏ క్షణమైనా అగ్ని పర్వతం పేలే చాన్స్ ఉందని తెలియజేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అగ్ని పర్వతాలు ఉన్నట్టుండి బద్దలైతే లావా, బూడిద ఎగసిపడి ఎయిర్ ట్రావెల్‌‌కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి 27 నుంచే ఈ అలర్ట్ ఇచ్చామని ఐస్‌‌లాండ్ వాతావరణ శాఖ తెలిపింది. గత బుధ, గురవారం నుంచి భూప్రకంపనల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతూ వస్తోందని చెప్పింది.

2010లో అతిపెద్ద ఎరప్షన్

ఐస్‌లాండ్‌ సదరన్ రీజియన్‌లో అప్పటి వరకు ఐస్‌తో కప్పబడి ఉన్న వేర్వేరు అగ్ని పర్వతాలు 2010లో బద్దలయ్యాయి. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద వాల్కనిక్ ఎరప్షన్. 2009 చివరిలో  మొదలై కొన్ని రోజుల పాటు భూప్రకంపనలు కంటిన్యూ అయ్యాయి. తరచూ ప్రకంపనలు రావడం వల్ల 2010లో నాలుగు చిన్న చిన్న వాల్కనో ఎరప్షన్స్ జరిగాయి. అయితే 2010 ఏప్రిల్‌ 14న ఎజఫ్‌జలజేకుల్ అగ్ని పర్వతం బద్దలై దాదాపు 9 కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగసిపడింది. ఆ ఎత్తు క్రమంగా తగ్గుతూ మే నెల చివరి వరకు లావా, బూడిద ఎగజిమ్మడం కంటిన్యూ అయింది. ఆ బూడిద దాదాపు నార్త్ యూరప్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో యూకే సహా 20 దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు లక్ష విమానాలు రద్దయ్యాయి. కోటి మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దీంతో బ్రిటన్‌కు చెందిన దాదాపు 13 ట్రావెల్ కంపెనీలూ భారీ నష్టాలతో మూతపడ్డాయి. యూరప్‌లో జరగాల్సిన అనేక స్పోర్ట్స్ సహా వేర్వేరు ఈవెంట్స్ రద్దయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతటి భారీ స్థాయిలో విమానాలు రద్దవడం మళ్లీ ఇదేనట.