యాదాద్రి, వెలుగు : ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న ప్రైవేట్ భూముల తొలగింపు ప్రక్రియ యాదాద్రి జిల్లాలో స్పీడ్‌గా సాగుతోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఐదారు రోజుల్లోనే వేలాది అప్లికేషన్లను పరిష్కరించారు. ఈ నెల 9 నుంచి జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొత్తం కలెక్టరేట్‌లోనే తిష్ట వేసి ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన భూములు మినహా మిగతా ప్రైవేట్ భూముల వివరాలను పరిశీలిస్తున్నారు. గతంలో సర్వే నంబర్ల వారీగా పరిశీలించిన ఆఫీసర్లు ఇప్పుడు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సర్వే నంబర్లను చెక్ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ భూములను నిషేధిత లిస్ట్‌లో చేర్చడానికి కారణాలు ఏంటి ? వాటిపై కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా ? స్టే కాలపరిమితి ఎప్పటివరకు ఉందన్న వివరాలను పరిశీలిస్తున్నారు ఒకవేళ స్టే కాలపరిమితి ముగిస్తే ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. వక్ఫ్, ఎండోమెంట్‌కు సంబంధించిన డిటెయిల్స్ కూడా తెప్పించుకొని రికార్డుల్లో ఉన్న భూములు కాకుండా మిగతా భూముల సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఇరిగేషన్‌కు సంబంధించి...
యాదాద్రి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల కారణంగా నిషేధిత జాబితాలో చేరిన వాటిని కూడా ఆఫీసర్లు పరిశీలన చేస్తున్నారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్, బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డి కాల్వల కోసం జిల్లాలో సుమారు 15 వేల ఎకరాలను సేకరించారు. అయితే ఒక సర్వే నంబర్‌లోని కొంత భూమిని ప్రభుత్వం తీసుకోగా ఆ నంబర్‌లోని మిగతా భూమిని కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారు. ఇలా జిల్లాలో వందలాది ఎకరాల భూములు నిషేధిత జాబితాలోకి చేరాయి. ప్రస్తుతం అలాంటి భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూములను మాత్రం భూ సేకరణ మాడ్యూల్‌లో చేరుస్తున్నారు.
5 రోజుల్లోనే 18 వేల మాడ్యూల్స్
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 321 రెవెన్యూ గ్రామాలు, 280 గ్రామాల్లో నిషేధిత భూముల పరిశీలన పూర్తైంది. మిగిలిన గ్రామాల్లోని భూముల పరిశీలన కూడా మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని ఆఫీసర్లు చెప్పారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 21 వేల మాడ్యూల్స్ నిషేధిత జాబితాలో ఉండగా ఇప్పటివరకు 18 వేల మాడ్యూల్స్‌ను పరిష్కరించారు. వివరాలను ఆఫీసర్లు ఎప్పటికప్పుడు కలెక్టర్ పమేలా సత్పతికి, అక్కడి నుంచి సీసీఎల్‌ఏకు పంపుతున్నారు.
రెండు రోజుల్లో పూర్తి
ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో భూములకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం డివిజన్‌లోని యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల భూమలను పరిశీలిస్తున్నాం. వీటిని రెండు రోజుల్లో పూర్తి చేస్తాం.
– భూపాల్‌రెడ్డి, ఆర్డీవో, భువనగిరి