PAK vs SA 1st T20: బుమ్రాకు ఛాలెంజ్.. 149 కి.మీ వేగంతో బాబర్‌ను డకౌట్ చేసిన 18 ఏళ్ళ పేసర్

PAK vs SA 1st T20: బుమ్రాకు ఛాలెంజ్.. 149 కి.మీ వేగంతో బాబర్‌ను డకౌట్ చేసిన 18 ఏళ్ళ పేసర్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. ఇప్పటికే క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన బుమ్రా..నెంబర్ వన్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. 

బుమ్రాకు తాను పోటీ అని సౌతాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా తెలిపాడు. సౌతాఫ్రికా 18 ఏళ్ళ ఫాస్ట్ బౌలర్ గతంలో తాను బుమ్రా కంటే గొప్ప బౌలర్ అని చెప్పుకొచ్చాడు. ఇది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే తాను ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్థాన్ తో స్వదేశంలో జరుగుతున్న తొలి టీ20లో మఫాకా తన ఫాస్ట్ బౌలింగ్ తో పాక్ ను భయపెట్టాడు. ముఖ్యంగా అతను వేసిన రెండో ఓవర్ లో రెండు బంతులు 150 పైగా స్పీడ్ వేయడం విశేషం. అతను వేసిన మూడో బంతి గంటకు 149 కి.మీ వేగంతో వేయగా..బాబర్ ఈ బంతికి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

గంటకు 145 కి.మీ వేగంతో నిలకడగా బంతులు వేస్తున్న మఫాకా భవిష్యత్తులో గొప్ప బౌలర్లలో ఒకడిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ జట్టులో రబడా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ ఉన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. మిల్లర్ 40 బంతుల్లో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో లిండే 48 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. మహ్మద్ రిజ్వాన్ చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. డిసెంబర్ 13 న ఇరు జట్ల మధ్య రెండో టీ20 జరుగుతుంది.