రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాదే ఉమర్ లో పవణ్ అనే 18 ఏండ్ల యువకుని గుర్తు తెలియని దుండగులు కత్తులతో అతి కిరాతకంగా దాడిచేసి హతమార్చారు. వాష్రూమ్ కని ఇంట్లో నుండి బయటికి వచ్చిన పవన్ ని అక్కడే కాచుకొని ఉన్న ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. పవణ్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకి వచ్చి చూసేలోపు దుండగులు పారిపోయారు. తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న పవణ్ ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. చేతికి అందొచ్చిన కొడుకు ఇక లేడని తెలిసి పవణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు, డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడు పవణ్ స్వస్థలం అమన్ గల్ కే స్లి తండాగా, స్థానిక కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, కొన్ని సంవత్సరాలుగా పవన్ కుటుంబ సభ్యులతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ వాది ఒమర్ లో నివాసం ఉంటున్నారు.
రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేసి వెళ్లారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ప్రాథమిక దర్యాప్తు ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి, క్లూస్ టీం ఆధారంగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
ఏసీపీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పవన్ కు అర్షియా(18)అనే యువతితో పరిచయం ఉండేదని, ఆ యువతి తనను ప్రేమించాలని చాలా సార్లు పవన్ ను అడిగినట్లు తెలిపారు. అయితే, వీళ్లిద్దరి విషయం తెలుసుకున్న అర్షియా అన్న, బాబాయ్ పవన్ ఇంటి ముందు కాపుకాసి రాత్రి బాత్ రూమ్ కు వెళ్లిన టైంలో కత్తులతో దాడి చేసి చంపేశారు. పవణ్ ను హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోయారని, ఆధారాలు సేకరించి పరారిలో ఉన్నవాళ్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు.