- మిడ్‌మానేరుకు ఎడమ వైపున్న పొలాలు మునగకుండా కరకట్ట
- నాసిరకంగా నిర్మించడంతో 180 ఎకరాలు మునక
- ఊటలు పడి పంటలు పండుతలేవని రైతుల ఆవేదన
- పరిహారం ఇవ్వని గత సర్కార్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలోని మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌కు ఎడమవైపు ఉన్న భూములు ముంపు బారినపడకుండా కరకట్ట నిర్మించారు. కానీ కరకట్టను నాసిరకంగా నిర్మించడంతో పక్కనే ఉన్న సుమారు 150 మంది రైతులకు చెందిన 180 ఎకరాలు మునుగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరితే ఊటలు పడి మునుగుతున్న పొలాలు.. ప్రాజెక్ట్ ఎండిపోయినా సాగుకు పనికిరాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ భూములకు గత సర్కార్పరిహారం ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
పరిహారం ఇప్పటిదాకా ఇయ్యలే
మిడ్‌మానేరు ప్రాజెక్ట్ఎడమవైపు వ్యవసాయ భూములు ఉండడంతో ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మించాలని 2005లో నాటి సర్కార్నిర్ణయించింది. సర్వే నెంబర్లు 223, 135లోని దళితులకు చెందిన 180 ఎకరాలు సేకరించింది. వీటిలో పంటలు పండే భూములకు రూ.12లక్షలు, మిగతావాటికి రూ.2.50లక్షలు ఇస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు. ఇప్పటిదాకా వీటికి పరిహారం అందలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. 2019లో 3 కి.మీ మేర రూ.50 కోట్లతో కరకట్ట నిర్మించారు. కానీ కరకట్టను లోపభూయిష్టంగా నిర్మించడంతో ప్రాజెక్ట్ నిండిన ప్రతిసారీ ఊటలు పడి కింది వైపున్న 180 ఎకరాలు మునుగుతున్నాయి. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం తగ్గినా సాగుకు పనికిరావడం లేదని రైతులు వాపోతున్నారు. నాలుగేండ్లుగా నష్టం పరిహారం అందక, భూముల్లో పంటలు పండక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వమైనా పరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ముంపు పొలాలను సందర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రెండెకరాలు నీట మునిగాయి
నాకు కరకట్ట కింద ఉన్న రెండెకరాలు మిడ్ మానేరు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతోంది. నాలుగేండ్లుగా సాగు చేయడం మానేశాం. పొలం ఊటలూరి నీరు రావడంతో భూములు మునుగుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిహారం ఇవ్వలేదు. కరకట్టను నిర్మించిందే భూములు మునగకుండా అంటున్నారు. అయినా భూములు ఎందుకు మునుగుతున్నాయి. గత సర్కార్ నిర్వాకంతోనే దళిత రైతులు నష్టపోతున్నారు.
ఆకునూరి బాల్‌రాజు, రైతు, సిరిసిల్ల