అర్హత ఉన్నా పెన్షన్ రావట్లే..  ఏడాదిన్నరగా 1.80 లక్షల మంది ఎదురుచూపు

  • అర్హత ఉన్నా పెన్షన్ రావట్లే..  ఏడాదిన్నరగా 1.80 లక్షల మంది ఎదురుచూపు
  • మీ-సేవ సెంటర్లలో దరఖాస్తులు తీసుకోని సర్కారు
  • కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్​కు క్యూ కడుతున్నరు
  • హుజురాబాద్ ఎన్నిక టైంలో చివరిసారిగా ఆసరా పింఛన్లకు అప్లికేషన్లు

కరీంనగర్, వెలుగు: అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వేలాది మందికి ఆసరా పింఛన్లు అందడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్లికేషన్లు తీసుకుని మంజూరు చేయకపోవడంతో పింఛన్ల కోసం బాధితులు ఏండ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఏడాదిన్నరగా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, 57 ఏండ్లు నిండిన వారు, 50 ఏండ్లు నిండిన బీడీ, గీత కార్మికులు కలిపి సుమారు 1.8‌‌ ‌‌లక్షల మంది పింఛన్లకు నోచుకోవడం లేదు. ఆసరా పింఛన్ల మంజూరు కోసం 2021 అక్టోబర్​లో అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత కొత్తగా అర్హత పొందిన వారిని పట్టించుకోవడం లేదు. గతంలో అర్హుల నుంచి పింఛన్ దరఖాస్తులను తీసుకుని పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలు ఆన్​లైన్ చేస్తుండేవారు. కానీ, ఏడాదిన్నరగా ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. దీంతో అర్హులైన వారంతా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్​లో అర్జీలు పెట్టుకుంటున్నారు. గ్రీవెన్స్ సెల్స్​లో భూసమస్యల తర్వాత పింఛను దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, పింఛన్ల మంజూరు కలెక్టర్ల చేతిలో కూడా లేకపోవడంతో  వారు అప్లికేషన్లు తీసుకొని ఎంపీడీవోలకు పంపిస్తున్నారు.

ఏడాది తర్వాత ఇచ్చారు

ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్ల మంజూరు కోసం 2021 ఆగస్టులో తొలిసారి అప్లికేషన్లు తీసుకుంది. అదే ఏడాది అక్టోబర్​లో మరోసారి అప్లికేషన్లు తీసుకుంది. అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే ఏడాది తర్వాత 2022 సెప్టెంబర్​లో పింఛన్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో నెలనెలా సుమారు ఐదారు వేల మందికి 57 ఏండ్లు నిండుతున్నట్లు అంచనా. మొత్తంగా సగటున ప్రతినెలా ఆసరా పించన్​కు అర్హత పొందుతున్నవారి సంఖ్య 10 వేలకుపైనే ఉంటుందని సమాచారం. ఈ లెక్కన గత 18 నెలల కాలంలో సుమారు లక్షన్నర మంది అర్హత పొందినట్లు తెలుస్తోంది. వీరంతా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో 36,872 మంది చేనేత కార్మికులు, 62,164 మంది గీత కార్మికులు ఈ కేటగిరీలో పింఛన్ పొందుతుండగా.. వీరిలోనూ చనిపోయిన వారి భార్యలకు వెంటనే పింఛన్ శాంక్షన్ కావడం లేదు. అలాంటి వారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు.

రామడుగు మండలం రామచంద్రాపురానికి చెందిన ఈ దివ్యాంగుడి పేరు కొడిమ్యాల మల్లేశం. రెండేండ్ల కింద డయాబెటిస్​ కారణంగా ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ కావడంతో మోకాలి వరకు తీసేశారు. కూలి పనులు చేసుకునే మల్లేశం కాలు కోల్పోవడంతో జీవనోపాధి కోల్పోయాడు. సదరం స్లాట్ బుక్ కాకపోవడం, పింఛన్ కోసం అప్లికేషన్ పెట్టుకునే అవకాశం మీ-సేవలో, ఎంపీడీవో ఆఫీసులో లేకపోవడంతో కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్​లో దరఖాస్తు ఇచ్చాడు.

50 ఏండ్లు నిండినా గీత కార్మికులకు ఇయ్యట్లే 

మాది వీణవంక మండలం చల్లూరు గ్రామం. నేను గీత కార్మికుడిని.  50 ఏండ్లు నిండడంతో చాలా సార్లు ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి ఆసరా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న. ఆ సైట్ ఓపెన్ కాకపోవడంతో మా పేర్లు నమోదు కావడం లేదు. అర్హులైన గీత కార్మికులందరికీ సర్కారు వెంటనే పింఛన్ ఇవ్వాలి.

- బొంగోని రాజయ్య,  గీత కార్మికుడు, వీణవంక