ఏపీలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. 300 దాటిన మ‌ర‌ణాలు

ఏపీలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. 300 దాటిన మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజు రోజుకూ భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,813 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. తాజా కేసుల్లో 1775 మంది లోక‌ల్స్ కాగా, న‌లుగురు విదేశాల నుంచి వ‌చ్చిన వారు, 34 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య 2,385, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారి సంఖ్య మ‌రో 428కి చేరింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 27,235కి పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 14,393 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 12,533 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

300 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో క్ర‌మంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య పెరగ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 17 మంది మ‌ర‌ణించారు. కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, అనంత పురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 309కి చేరింది. అయితే మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం ఏపీ ప్ర‌భుత్వం రోజూ వేల సంఖ్య‌లో టెస్టులు చేస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 20,590 శాంపిల్స్‌ పరీక్షించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా టెస్టుల సంఖ్య 11,36,225కు చేరింది.