- ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ
- 18.30 గ్రాముల గంజాయి స్వాధీనం
గద్వాల/అలంపూర్, వెలుగు : ఏపీ, తెలంగాణ బార్డర్ లోని ఉండవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర డ్రగ్స్ కలకలం రేపింది. ఉండవల్లి ఏఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న రెండు వెహికల్స్(ఒక ఇన్నోవా, ఒక బీఎండబ్ల్యూ)ను ఫాలో అయిన పోలీసులు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర సోమవారం రాత్రి ఆపి తనిఖీ చేశారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేశారు. వారి నుంచి 18.30 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సల్మాన్ ఫైజల్, అక్షయ్ హోల్క్ కుండే, మహమ్మద్ సాద్, మైసం ధర్వేజ్, పర్వరీశ్ అలీఖాన్, దొడ్లే సాయిరాం, సైఫ్ బిన్ అలీద్, అహ్మద్ తౌఫిక్ బ్లడ్ ను సేకరించి టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు సమాచారం రావడంతో సోమవారం సాయంత్రం నుంచి టోల్ ప్లాజా దగ్గర నార్కోటిక్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా పెట్టారు.
హనుమకొండలో తనిఖీలు
హనుమకొండ : న్యూ ఇయర్ నేపథ్యంలో వరంగల్ పోలీసులు మత్తు పదార్థాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. డ్రగ్స్, గంజాయి జిల్లాలోకి రాకుండా సీపీ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. యాంటీ డ్రగ్స్ టీమ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు కలిసి వరంగల్ ట్రై సిటీలో సోదాలు చేశారు. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. హనుమకొండ బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు.