- రాష్ట్రవ్యాప్తంగా 1,14,174 కేసులు
- 18 శాతం పెరిగిన సైబర్ నేరాలు
- రూ.177 కోట్లు బాధితులకు రిఫండ్
- 14,984 సిమ్ కార్డులు..9,811 ఐఎంఈఐ నంబర్లు బ్లాక్
- 1,057 మంది నేరగాళ్ల లింకులు గుర్తింపు.. 186 మంది అరెస్ట్
- వార్షిక నివేదిక విడుదల చేసిన సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏటా దాదాపు రూ.2 వేల కోట్లు దోచేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,14,174 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. కేటుగాళ్లు రూ.1,867 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో గోల్డెన్ అవర్స్‌లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి దాదాపు రూ.200 కోట్లు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫ్రీజ్ చేసింది.
రూ.177 కోట్లను బాధితులకు అప్పగించింది. మొత్తం 186 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. వీరు రాష్ట్రంలో నమోదైన 917 సైబర్ నేరాల్లో నిందితులు కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 3,637 కేసులతో వీరికి సంబంధం ఉన్నట్లు గుర్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ దేవేందర్ సింగ్, అడిషనల్ డీఎస్పీలు హరికృష్ణ, సూర్యప్రకాశ్, కేవీఎం ప్రసాద్‌తో కలిసి బ్యూరో వార్షిక నివేదికను శిఖా గోయల్ విడుదల చేశారు.
పెరుగుతున్న బాధితుల సంఖ్య
పోలీసులకు చిక్కకుండా ఆన్‌లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు వేల కోట్లు దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ సహా ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భారీగా దోపిడీ చేశారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 91,652 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 18 శాతం అధికంగా 1,14,174 కేసులు రిపోర్ట్ అయ్యాయి. రోజుకు సగటున 316 మందికిపైగా బాధితులు రూ.5.4 కోట్లు కోల్పోయారు.
ఇందులో బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, పార్ట్ టైమ్ జాబ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన సైబర్ నేరాల్లో రూ.వేల కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఆన్‌లైన్ అడ్డాగా సాగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా మోసపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
బాధితుల్లో చదువుకున్నోళ్లే ఎక్కువ
సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో సుదీర్ఘ అధ్యయనం చేసింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ట్రాన్ శాక్షాన్లపైనే సైబర్ నేరగాళ్లు టార్గెట్‌గా చేసినట్లు గుర్తించింది. సోషల్ మీడియాలో వచ్చే లింక్స్‌తో పాటు ఆన్‌లైన్ వేదికగా దాదాపు185 రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల బాధితుల్లో దాదాపు 90 శాతం మంది విద్యావంతులే ఉంటున్నారని సీఎస్‌బీ వెల్లడించింది.
ఈజీ మనీకి అలవాటుపడిన యువత కూడా తక్కువ మొత్తంలో పెట్టుబడులతో మొదలుపెట్టి లక్షల వరకూ సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు వ్యాపారం పేరుతో ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్ మెంట్ల కోసం సైబర్ నేరగాళ్లు వర్చువల్ అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నారు. విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా డిజిటల్‌గా బ్యాలెన్స్ చూపుతున్నారు.
కొరియర్ పేరుతో డిజిటల్ అరెస్ట్‌లు
ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, డ్రగ్స్, కస్టమ్స్, ట్రాయ్, సీబీఐ, సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అరెస్ట్ చేస్తామంటూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఫెడెక్స్ కొరియర్‌లో వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్, బంగారం, నిషేధిత వస్తువులు ఉన్నాయని ఢిల్లీ, ముంబయి పోలీసుల పేరుతో స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ అర్ధరాత్రి గంటల తరబడి వేధింపులకు గురిచేస్తున్నారు. అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు.
ఇలా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్‌నేరాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కర్నాటకకు చెందిన బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. డార్క్‌వెబ్ సైట్లలో కొనుగోలు చేసిన ఫోన్ నంబర్స్, ఏజెన్సీల ద్వారా కలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నారు. రైతుల దగ్గర్నుంచి రాజకీయ ప్రముఖులు, పోలీసులు, ఐటీ ప్రొఫెషనల్స్ సహా కార్పొరేట్ దిగ్గజాల వరకు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
అలర్ట్‌గా ఉండాలి
సైబర్ సెక్యూరిటీ బ్యూరో,1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. సైబర్ మోసాల్లో బాధితులకు గతేడాది రూ. 8.36 కోట్లు రీఫండ్ చేయగా ఈ ఏడాది రూ. 176.71 కోట్లు రీఫండ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో1,057 మంది సైబర్ నేరగాళ్ల లింకులను గుర్తించాం. ఇప్పటికే 186 మందిని అరెస్ట్ చేశాం. రాజస్థాన్, జైపూర్, జోధ్‌పూర్‌లో మూడు ఆపరేషన్స్ నిర్వహించాం. రాష్ట్రంలో నమోదైన 189 కేసులకు గాను 27 మందిని అరెస్ట్ చేశాం. వీరిపై దేశవ్యాప్తంగా 2,223 కేసులు ఉన్నాయి. బాధితుల్లో 90 శాతం విద్యావంతులు, ఐటీ ఉద్యోగులే ఉంటున్నారు. ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా దోపిడీకి పాల్పడుతున్నారు. అలర్ట్ గా ఉన్నప్పుడే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలం.
- శిఖా గోయల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సీఎస్‌బీ యూనిట్స్ వారిగా ఫిర్యాదులు
సైబరాబాద్ 25,112
హైదరాబాద్ 20,299
రాచకొండ 14,815
వరంగల్ 3,531
సంగారెడ్డి 3,132
బాధితుల్లో ఏ వర్గం వారు ఎంత శాతం?
ప్రైవేట్ ఎంప్లాయిస్: 56 శాతం
సెల్ఫ్ ఎంప్లాయీస్: 10 శాతం
బిజినెస్‌మెన్: 09 శాతం
స్టూడెంట్లు: 09 శాతం
ప్రభుత్వ ఉద్యోగులు: 05 శాతం
గృహిణులు: 05 శాతం
ఇతరులు: 06 శాతం
సంవత్సరం ఫిర్యాదులు కోల్పోయిన డబ్బు రీఫండ్ చేసిన అమౌంట్ సిమ్ కార్డులు ఐఎంఈఐలు
2023 91,652 రూ.778.7 కోట్లు రూ.8.36 కోట్లు 24,227 181
2024 1,14,174 రూ.1,866.9 కోట్లు రూ.176.71 కోట్లు 14,984 9,811