కుంభమేళా హైలైట్స్: 1896లో పుట్టారు.. గత 100 ఏండ్లుగా ప్రతి కుంభమేళాకు స్వామి శివానంద బాబా

కుంభమేళా హైలైట్స్: 1896లో పుట్టారు.. గత 100 ఏండ్లుగా ప్రతి కుంభమేళాకు స్వామి శివానంద బాబా
  • సెర్చ్ ఇంజన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యానిమేషన్ 
  •  వందేండ్లలో ప్రతి కుంభమేళాలో పాల్గొన్న 127 ఏండ్ల బాబా

ప్రయాగ్ రాజ్: ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేట్‌‌‌‌ చేసింది. తన సెర్చ్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో గులాబీ రేకులతో కూడిన వర్చువల్‌‌‌‌ యానిమేషన్‌‌‌‌ జోడించింది. గూగుల్‌‌‌‌ లో ‘కుంభ్’, ’మహా కుంభ్’, ‘కుంభమేళా’, ‘మహాకుంభ్’ అని సెర్చ్‌‌‌‌ చేయగానే గులాబీ రేకులు వానలా కురిసేలా యానిమేషన్‌‌‌‌ కనిపిస్తుంది. గులాబీ రేకుల వర్షం పడుతున్నట్టు కనిపించే ఈ యానిమేషన్‌‌‌‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ యానిమేషన్‌‌‌‌ను షేర్‌‌‌‌ చేసే అవకాశం కూడా ఉంది.

ప్రతి కుంభమేళాలో పాల్గొన్న బాబా.. 
పద్మశ్రీ అవార్డు గ్రహీత, 127 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు స్వామి శివానంద బాబా గత 100 ఏండ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరయ్యారు. ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ లో జరిగే  ప్రతి కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయన శిష్యుడు సంజయ్ సర్వజన తెలిపారు. స్వామి శివానంద అత్యంత పేదరికంలో జన్మించారు. నాలుగేండ్లు వచ్చే వరకు పాలు, పండ్లు, బ్రెడ్ వంటి పదార్థాలను చూడలేదు. దీంతో క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడింది. ఆయన రాత్రి 9 గంటలకే నిద్రపోయి వేకువజామున 3కే  నిద్ర లేస్తారు. అనంతరం యోగా, ధ్యానం చేస్తారు.  మధ్యాహ్నం పూట నిద్ర పోరు. చాలా కాఠిన్యంతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకున్నారు.

10 దేశాల నుంచి ప్రతినిధి బృందం.. 
యూపీ సర్కారు నిర్వహిస్తోన్న మహా కుంభమేళా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమాన్ని10 దేశాలకు చెందిన 21 మంది సభ్యుల ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. విదేశీ వ్యవహారాల శాఖలోని ఎక్స్ టర్నల్ పబ్లిసిటీ అండ్ పబ్లిక్ డిప్లమసీ విభాగం ఈ అంతర్జాతీయ ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించింది. బుధవారం ఈ బృందం ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఆరైల్‌‌‌‌ లోని టెంట్ సిటీలో వీరికి  బస ఏర్పాట్లు చేశారు.

ఈ బృందంలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో,   యూఏఈ నుంచి వచ్చిన వారు ఉన్నారు.  ఈ సందర్భంగా గయానాకు చెందిన దినేశ్ పెర్సాద్ గంగానదిలో పవిత్ర స్నానం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఎప్పట్నుంచో  గంగా నదిలో పుణ్యస్నానం చేయాలని కోరుకున్నాను. ఇయ్యాల ఆ కోరికను నెరవేర్చుకున్నాను. ఈ వేడుకలో పాలు పంచుకోవాలని ఇతరులను కోరుతున్నాను” అని ఆయన తెలిపారు. కుంభమేళా నిర్వహణ ఏర్పాట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌‌‌కు చెందిన సాలీ ఎల్ అజాబ్ కూడా ప్రశంసించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం అని కొనియాడారు.