ఎంపీలు ఏం చేస్తున్నట్లు?

ఎంపీలు ఏం చేస్తున్నట్లు?

భారతదేశమంతటా ప్రజాస్వామ్య వేడుకలు జరుగుతున్న వేళ 18వ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. 543 మంది లోక్​సభ సభ్యులను ఎన్నుకునేందుకు 968 మిలియన్ల ఓటర్లు ఈసారి ఓటు చేస్తున్నారు. పరిణతి చెందిన, విజయవంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన మనదేశంలో  ఎన్నికలు నిర్వహించడం గొప్ప సవాలే కాక ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. 2019లో 55,000 కోట్ల రూపాయిలు ఎన్నికల కోసం ఖర్చు కాగా తాజా ఎన్నికల్లో ఇది లక్ష కోట్లు దాటుతుందని అంచనా. అంటే 543 మంది కోసం 44 రోజులు ఎన్నికల ప్రక్రియలు, 1,00,000 కోట్ల రూపాయిలు ఓటర్లకు ప్రలోభాలు, ప్రచారం, ఎన్నికల నిర్వహణ తదితరాల రూపంలో డబ్బు వినిమయ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

లోక్​సభకు హాజరు తగ్గుతున్నది

లక్ష కోట్ల ఖర్చుతో ఇంత కష్టపడి ఎన్నికల ద్వారా లోక్​సభ సభ్యులను ఎన్నుకుంటే చట్టసభల్లో వీరి పనితీరు, ఉత్పాదకత, నియోజకవర్గ ప్రజలకు అందుబాటు, తదితర విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. చాలామంది సభ్యులు సంప్రదాయ విధులైన రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, రాజ్యాంగ సవరణ, చట్టాల తయారీ ఆమోదం కోసం పార్టీలు విప్​  జారీ చేసినప్పుడు తప్పక హాజరవ్వటం వంటివి మాత్రమే చేస్తున్నారు. 

17వ లోక్​సభలో ఆరు శాతం మంది ఎంపీలు 50 శాతం సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. మొత్తంగా సభ్యుల హాజరు శాతం 79 శాతం మాత్రమే ఉంది. ఒక లోక్​సభ ఎంపీ సగటున 158 ప్రశ్నలు అడగగా  రాజ్యసభలో 196 ప్రశ్నలు అడిగారు. లోక్​సభలో ఆరుగురు సభ్యులు, రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. సగటును ఒక ఎంపీ ఐదు సంవత్సరాలలో 45 చర్చల్లో పాల్గొనగా, పీజీ చదివిన వారు 59 చర్చల్లో, ఇంటర్ మాత్రమే చదివిన వారు 34 చర్చల్లో పాల్గొన్నారు.

ప్రజాసంబంధాలు కరువు

 నిత్య రాజకీయాలకు అలవాటుపడిన ఎంపీలు పార్టీ విధేయతకు పట్టం కడుతూ ప్రజాస్వామిక స్ఫూర్తిని, విలువలను మరచిపోతూ ప్రశ్నించే స్వభావాన్ని విడనాడుతున్నారు. ప్రభుత్వ బిల్లులు, బడ్జెట్ వంటి వాటిపై చర్చల్లో అధికార పార్టీ ఎంపీలు లోపాలను ఎత్తిచూపితే అధినేత కోపానికి కారణమవుతామని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించడం లేదు. ప్రభుత్వ విధానాలను విపక్షం తప్ప స్వపక్ష సభ్యులు క్షణకాలం పాటు విమర్శించే సాహసం చేయడం లేదు. 

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం మన మౌలిక హక్కు అన్న సత్యాన్ని పార్టీలు గుర్తించి సభ్యులకు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుమతించాలి. ఎంపీలు ఎన్నికల ప్రచారం సమయంలో మాత్రమే ఆ నియోజకవర్గ ప్రజలను నేరుగా కలుస్తున్నారు. గెలిచాక మళ్ళీ ప్రజల ముఖం చూడటం లేదు. వారి ఎంపీ లాడ్స్​ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఎవరికి తెలియదు. మన నియోజకవర్గ ఎంపీ ఎవరు అని అడిగితే ఆ పేరు చెప్పలేనివారే ఎక్కువ ఉంటున్నారంటే ఆ ఎంపీ పనితీరు అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఎమ్మెల్యేలే సర్వాధికారులై మంత్రులు ఎంపీలను  నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగనియ్యడం లేదు. 

ఇది ఒక రకమైన అధికార పోటీగా భావిస్తున్నారు. ప్రశ్నించడానికి డబ్బులు తీసుకునేవారు, దేశ సమగ్రతను దెబ్బతీసేలా కుల, మత తత్వాలను ప్రోత్సహించేవారిని, డబ్బు వెదజల్లి ఎంపీ పదవిని అలంకారంగా, పెట్టుబడిగా భావిస్తున్న వారిని ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు అనే వజ్రాయుధం ద్వారా తిరస్కరించాలి. ఎంపీలు  వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యాలయాలను సందర్శించి అభివృద్ధిని పర్యవేక్షించాలి. రాష్ట్ర అభివృద్ధికై రావాల్సిన గ్రాంట్లు, నిధులు, రాష్ట్ర విభజన హామీలు, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు సమాన వాటాకు కృషి , తదితర విషయాలపై ప్రశ్నించాలి. ప్రైవేటు మెంబర్ బిల్లులు వంటి అవకాశాలను ఉపయోగించుకొని క్రియాశీలంగా ఉండాలి. 

తండ ప్రభాకర్ గౌడ్, సోషల్ ఎనలిస్ట్

  • Beta
Beta feature
  • Beta
Beta feature