- 17 నుంచి ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17 నుంచి బీటెక్ ఫస్టియర్‌లో ప్రవేశాల కోసం టీఎస్ఎంసెట్ అడ్మిషన్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటాలో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. మొత్తం 19,049 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 3,034 సీట్లు ఉండగా, ఎలక్ట్రానికల్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో 2,721 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ)లో 2,630 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో 2,542, సివిల్ ఇంజినీరింగ్‌లో 2,505 సీట్లు, సీఎస్ఈ ఏఐఎంఎల్‌లో 1,785 సీట్లు ఉన్నాయి. సీఎస్ఈ డేటా సైన్స్‌లో 1,012, సైబర్ సెక్యూరిటీలో 299, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 553 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా టీఎస్ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 17 నుంచి 25 వరకూ కొనసాగుతుందని ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ వాకాటి కరుణ తెలిపారు. 17న ఆన్లైన్లో దరఖాస్తు, ఫీజు చెల్లింపు ఉంటుందని, 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 17 నుంచి 19 వరకు ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ నెల 23న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని, 25లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు.