- వేటగాళ్ల ఉచ్చులో చిక్కి వన్యప్రాణులు బలి.. విలువైన చెట్లను నరికివేస్తున్న అక్రమార్కులు
- ఆక్రమణకు గురవుతున్న ఫారెస్టు భూములు
- స్థానిక ప్రజలు సమాచారం ఇస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు
సిరికొండ,వెలుగు: అక్రమార్కుల కారణంగా అడవి సంపద హరించుకుపోతోంది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి నీల్గాయ్, దుప్పి, కుందేళ్లు, కొండ గొర్రెలు వంటి వన్యప్రాణులు బలవుతున్నాయి. గొడ్డలి వేటుకు విలువైన చెట్లు మాయం అవుతుండగా.. భూములు కబ్జాల పాలవుతున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా అటవీ రక్షణ చట్టాలు సరిగా అమలుకు నోచుకోకపోతుండగా అక్రమార్కులకు అడ్డేలేకుండా పోతోంది.
నిజామాబాద్జిల్లా సిరికొండ మండలంలో 19 వేల హెక్టార్లలో అటవీ భూములు, వేలల్లో వణ్యప్రాణులు ఉన్నాయి. అడవికి సమీపంలోని గ్రామాలైన పందిమడుగు, రావుట్ల, న్యావనంది, జంగిలోడి తండా, పాకాల, తూంపల్లి, గుడిలింగాపూర్, సిరికొండ, లొంకతండా, దూప్యా తండాలో నిత్యం వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు చిక్కుతున్నాయి. గొడ్డలివేటుకు వందలాది వృక్షాలు కనుమరుగవుతున్నాయి. కొందరు భూమిని చదును చేసి పంటలు పండిస్తున్నారు. గడిచిన ఆరు నెల్లలో వందల ఎకరాల్లో ఫారెస్టు ల్యాండుకు కబ్జా అయింది.
ఇలా వందల సంఖ్యలో వన్యప్రాణులు, వేల సంఖ్యలో చెట్లు, వందల ఎకరాల్లో ఫారెస్టు ల్యాండు ఆక్రమణకు గురవుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్టు ఆఫీసర్లకు సమాచారం అందించినా కూడా స్పందించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సిరికొండ రేంజ్ఆఫీసర్వినాయక్ నాయక్, సెక్షన్ ఆఫీసర్ వసంత్‌రావు, నరేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్చేసినది తెలిసిందే. అయినా.. కొత్త ఆఫీసర్లు వచ్చినా అడవిలో అక్రమార్కుల వేట, వేటు, కబ్జాలు ఆగడం లేదు.
కొన్ని ఘటనలు..
గత ఆగస్టులో రావుట్ల బీట్ పరిధిలోని జంగిలోడి తండాకు చెందిన కొందరు వ్యక్తులు ఫారెస్టు ల్యాండ్‌ను కబ్జా చేయడంతో జిల్లాస్థాయి అధికారులు పరిశీలించారు. కబ్జా చేసి పంటలు వేయగా వాటిని ఫారెస్టు ఆఫీసర్లు ధ్వంసం చేశారు. దీంతో ఫారెస్టు, గిరిజనుల మధ్యరాళ్ల దాడి చోటుచేసుకుంది.
సిరికొండ మండల శివారులోని బొడ్డుమామిడి చెరువు సమీపంలో 40 –50 ఎకరాల్లో వందలాది చెట్లు నరికివేసి ఫారెస్టు ల్యాండ్ ను కబ్జా చేశారు.
సిరికొండ పరిధి సేవాలాల్ తండాలో రూ. 70 వేల విలువైన టేకు దుంగలను ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు.
కొద్ది రోజుల కిందట తూంపల్లి గుడిలింగాపూర్ పరిధిలో ఫారెస్టు ల్యాండ్ లో చదును చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేశారు.
మూడు రోజుల కిందట సిరికొండ ఫారెస్టులో నీల్గాయ్ని వేటాడిన వ్యక్తిని ఫారెస్టు ఆఫీసర్లు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.