- దేశవ్యాప్తంగా19.66 లక్షల మందికి టెస్టులు..49.43% మందికి డయాబెటిస్
- డయాబెటిస్ స్టేజ్‌లో 27.18%..ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో 22% మంది
- మగవారిలోనే అత్యధికంగా30.84% మందికి షుగర్
- 18 నుంచి 35 ఏండ్ల మధ్య వారిలోనూ ఎక్కువ మందికి సమస్య
- ఒడిశాలో ఎక్కువ.. కాశ్మీర్లో తక్కువ మందికి డయాబెటిస్
- టాప్ టెన్‌లో తెలంగాణ
- ఇన్సులిన్ నిరోధకత పెరగడమూ కారణమే
- చిప్స్, సమోసా, మటన్ / బీఫ్‌తో ముప్పుందన్న ఐసీఎంఆర్ స్టడీ
హైదరాబాద్, వెలుగు: దేశంలో మధుమేహం ‘మహమ్మారి’లా వ్యాపిస్తున్నది. ఏటికేడాది దాని బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ప్రముఖ డయాగ్నస్టిక్స్ సంస్థ థైరోకేర్ చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. స్టడీలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది మధుమేహం బారిన పడినట్టు తేలింది. ‘ప్రిడయాబెటిస్, డయాబెటిస్ ఇన్ ఇండియా’ పేరుతో థైరోకేర్ సంస్థ దేశవ్యాప్తంగా19,66,449 మంది నుంచి బ్లడ్ శాంపిళ్లను సేకరించి హెచ్‌బీఏ1సీ టెస్టులు చేసింది. దీంతో స్టడీలో పాల్గొన్న వారిలో 49.43 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు వెల్లడైంది. అందులో పూర్తిగా డయాబెటిస్ బారిన పడిన వాళ్లు 27.18 శాతం మంది ఉండగా.. ప్రిడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నవాళ్లు 22.25 శాతం ఉన్నారని స్టడీలో గుర్తించారు. ఒడిశాలో అత్యధిక మంది డయాబెటిస్ బారిన పడగా.. అత్యల్పంగా జమ్మూకాశ్మీర్ ప్రజలు షుగర్ బారిన పడినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ జాబితాలో తెలంగాణ టాప్‌టెన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ స్టడీ వివరాలు ఇటీవల ‘డయాబెటిస్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్’ అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.
మగవారిలోనే ఎక్కువ
స్టడీలో పాల్గొన్నవారిలో మగవారే అత్యధిక సంఖ్యలో మధుమేహం బారినపడ్డారని థైరోకేర్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 30.84 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు గుర్తించారు. ఇక మహిళల్లో ఆ సంఖ్య 23.51 శాతంగా ఉందని తేల్చారు. ప్రిడయాబెటిస్ విషయంలో మాత్రం పురుషులు, మహిళలు సమానంగా ఎఫెక్ట్ అవుతున్నారని రిపోర్ట్ వెల్లడించింది. 21.56 శాతం మంది మగవారు.. 22.95 శాతం మంది మహిళలు ప్రిడయాబెటిస్ రేంజ్లో ఉన్నారని తెలిపింది. మరోవైపు సంపాదించే ఏజ్‌లో ఉన్నవాళ్లూ ఎక్కువగా దీని బారిన పడుతున్నట్టుగా థైరోకేర్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్న యువతీయువకులు కూడా ప్రిడయాబెటిస్ దశలో ఉన్నారని.. స్టడీలో పాల్గొన్న ఈ ఏజ్‌గ్రూప్ వారిలో 30 శాతం మందికి ఆ సమస్య ఉన్నట్టుగా తేలింది. అయితే, 36 నుంచి 65 ఏండ్ల మధ్య వారిలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉందని రిపోర్ట్ వెల్లడించింది. స్టడీలో భాగమైన 65 ఏండ్లపైనున్న వారిలో 44.92 శాతం మందికి, 51 నుంచి 65 ఏండ్ల గ్రూప్వారిలో 41.85 శాతం మందికి షుగర్ ఉన్నట్టు తేల్చారు.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతున్నది..
దేశ ప్రజల్లో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జన్యు కారణాలతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుండడం వల్ల కూడా దేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య అధికమవుతోందని చెబుతున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే.. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ఇన్సులిన్ హార్మోన్ కు మన శరీరంలోని కణాలు సరిగ్గా స్పందించకపోవడం. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహ బాధితులు మరింతగా పెరిగితే దేశ ఆరోగ్య రంగంపై పెను ప్రభావం పడుతుందని, ప్రజల ఆర్థిక స్థితిగతులూ ప్రమాదంలో పడతాయని రిపోర్ట్‌లో హెచ్చరించారు.
రోజూ 2 గంటలైనా ఎక్సర్ సైజ్ చేయాలి..
ప్రస్తుత మెకానికల్ లైఫ్‌లో చాలా మంది బద్దకపు జీవితానికి అలవాటు పడిపోయారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువమంది కనీసం అరగంట కూడా శారీరక శ్రమ చేయడం లేదని, ఫలితంగా మెటబాలి జంపై ఎఫెక్ట్ పడుతోందని చెబుతున్నారు. అందుకే రోజూ కనీసం రెండు గంటలైనా ఎక్సర్సైజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాకుండా షుగర్ స్థాయిలు ఎక్కువుండే ఫుడ్స్‌ను దూరం పెట్టి.. ఆకుకూరలు, పండ్లు, చేపలు, ఉడకబెట్టిన ఆహారం, బ్రౌన్‌రైస్ వంటివి తినాలని సూచిస్తున్నారు.
హెచ్‌బీఏ1సీ అంటే..
మన రక్తంలోని చక్కెర స్థాయిల మూడు నెలల సగటును తెలుసుకునేందుకు చేసే టెస్టే హెచ్‌బీఏ1సీ. సాధారణంగా రక్తంలోని హీమోగ్లోబిన్‌కు చక్కెర (గ్లూకోజ్ అణువు) అతుక్కుపోతుంది. దానినే గ్లైకేషన్ అంటారు. శరీరంలో చక్కెర స్థాయిలు ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువగా హీమోగ్లోబిన్‌కు అది అతుక్కుంటుంది. దాదాపు మూడు నెలలపాటు అలాగే ఉండిపోతుంది. దాని సగటును తెలుసుకునేందుకు చేసే టెస్టునే హెచ్‌బీఏ1సీ అంటారు. దీనినే గ్లైకేషన్ హీమోగ్లోబిన్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా రక్తపు చుక్కతో చేసే టెస్టుతో ఆ టైంకు ఎంత బ్లడ్ షుగర్ ఉందో మాత్రమే తెలుసుకునేందుకు వీలవుతుంది. కానీ హెచ్‌బీఏ1సీ ద్వారా మూడు నెలల కాలంలో మన ఒంట్లో ఎంత స్థాయిలో షుగర్ ఉందో తెలుసుకోవచ్చు. ఈ స్టడీలో ఈ టెస్టుల ద్వారానే థైరోకేర్ సంస్థ రిపోర్ట్ ను సిద్ధం చేసింది.
హెచ్‌బీఏ1సీ లెవల్స్ ఎంతుండాలంటే..
రక్తంలో హెచ్‌బీఏ1సీ స్థాయిలు 5.7 శాతం కన్నా తక్కువగా ఉంటే వారు డయాబెటిస్ కు దూరంగా ఉన్నట్టు భావిస్తారు. ఒకవేళ 5.7 నుంచి 6.5 శాతం మధ్య (117 నుంచి 137 ఎంజీ/డీఎల్) ఉంటే ప్రిడయాబెటిస్ దశలో ఉన్నారని అర్థం. అంటే దాదాపు మధుమేహానికి దగ్గరయ్యారన్నట్టే. ఇక హెచ్‌బీఏ1సీ స్థాయిలు 6.5 శాతం కన్నా లేదా 137 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్టైతే షుగర్ బారిన పడ్డట్టు చెప్తారు.
తినే తిండే కారణం
ఆహారపుటలవాట్లే మధుమేహం బారిన పడడానికి ప్రధాన కారణమని రిపోర్ట్ తేల్చింది.అన్నం ఎక్కువ తినే రాష్ట్రాల్లోనే మధుమేహ బాధితులు ఎక్కువగా ఉంటున్నట్టు స్టడీ నిర్ధారించింది. అన్నానికి ప్రత్యామ్నాయంగా గోధుమలు, ఇతర ఫుడ్స్ తీసుకుంటున్న వారిలో మాత్రం మధుమేహం ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే, ఇటీవల డయాబెటిస్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సైంటిస్టులు చేసిన ఓ స్టడీలో.. సమోసాలు, చిప్స్ వంటి ఫుడ్స్తోనూ మధుమేహం వస్తున్నట్టు తేల్చారు. అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అత్యధికంగా ఉండే మటన్/బీఫ్, ఫ్రెంచ్‌ఫ్రైస్, వేపుళ్లు, బేకరీ ఫుడ్స్, సమోసాలు, ఆలూ చిప్స్, పరాటాలు, షుగర్ స్థాయిలు ఎక్కువుండే ఫుడ్ ఐటమ్స్‌తో మధుమేహం ప్రమాదం ఎక్కువగా ఉంటున్నట్టు ఐసీఎంఆర్ సైంటిస్టులు హెచ్చరించారు.