
- సురవరం ప్రతాపరెడ్డి మనుమరాలికి సన్మానం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద 1969 ఉద్యమ కారులు ఘన నివాళులు అర్పించారు. ఉద్యమకారుల సమితి ప్రెసిడెంట్, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు, సెక్రటరీ జనరల్ దుశ్చర్ల సుదర్శన్ రావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేచినేని కిషన్ రావు, సుదర్శన్ రావు మాట్లాడుతూ.. 1969 ఉద్యమ కారుల స్మృతి వనం కోసం 100 ఎకరాల ల్యాండ్ ను కంటోన్మెంట్లో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని
కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపానికి ఇంతవరకూ శిలాఫలకం లేదని, వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శిల్పి ఎక్కా యాదగిరిని సన్మానించాలన్నారు. 1969 ఉద్యమకారులకు ల్యాండ్, పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి మనుమరాలు సుగుణను సన్మానించారు.
అనంతరం బీజేపీ ఆహ్వానం మేరకు ఆ పార్టీ ఆఫీస్‌కు ఉద్యమకారులు వెళ్లారు. వారిని ఎంపీ లక్ష్మణ్ సన్మానించారు. ఉద్యమ కారులకు కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే హామీ నెరవేరేలా చూస్తానని తెలిపారు.