కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలి .. 1969 తెలంగాణ ఉద్యమ కారుల సంఘం

కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలి .. 1969 తెలంగాణ ఉద్యమ కారుల సంఘం

బషీర్​బాగ్, వెలుగు: కాంగ్రెస్  మేనిఫెస్టోలో ఇచ్చిన  హమీల ప్రకారం 1969  తొలిదశ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అమరుల డిమాండ్లను నెరవేర్చాలని గన్​పార్క్​లోని అమర వీరుల స్థూపం వద్దకు శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన 1969 తెలంగాణ ఉద్యమకారులు నివాళులర్పించారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించామని, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని సంఘం అధ్యక్షుడు రామరాజు వాపోయారు. ఆనాటి ఉద్యమంలో 369 మంది యువకులు పోలీసుల తూటాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ డిమాండ్లు పరిష్కారమవుతాయని అనుకున్నామని, కేసీఆర్ తానే ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు అహంకార ధోరణితో తమను దగ్గరకు కూడా రానివ్వలేదని విమర్శించారు. 

తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమకు అండగా నిలవాలని కోరారు.  కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా.. 250 గజాల స్థలం, 25 వేల పెన్షన్, అమరుల కుటుంబం 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, హెల్త్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రధాన కార్యదర్శి మారం సంతోశ్​ రెడ్డి , ఉపాధ్యక్షులు చంద్రమౌళి , నాయకులు కే. మోహన్ రావు, కొట్టం రవి, లక్ష్మీనారాయణ, సీతారాంరెడ్డి, ధనుంజయ్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.