
భారత క్రికెట్లో అపురూప విజయం..అద్భుత విజయం..భారత క్రికెట్ రూపురేఖలు మార్చిన విజయం. అదే 1983 వరల్డ్ కప్ విజయం. దేశంలో క్రికెట్ మతంలా మారడానికి ఈ విజయం నాంది పలికింది. అండర్ డాగ్ గా బరిలోకి దిగి విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి అంచున ఉన్న భారత జట్టు..అద్భుతపోరాటంతో చరిత్రను తిరగరాసే విజయాన్ని సొంతం చేసుకుంది. యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచిన ఈ విజయానికి నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా 40 ఏండ్ల క్రితం అంటే జూన్ 25వ తేదీ 1983లో భారత జట్టు మొట్టమొదటి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.
అప్పట్లో వరుసగా ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టు వెస్టిండీస్. అందులో క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్, మైకేల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్ లాంటి దిగ్గజాలు ఉండటంతో..ప్రత్యర్థులకు వణుకుపుట్టేది. అంతకుముందు వరుసగా తొలి రెండు (1975, 1979) ప్రపంచకప్‌లనూ వెస్టిండీసే గెలిచింది. ఈ సమయంలో ముచ్చటగా మూడోసారి కూడా విండీస్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా భయంకరజట్టుకు షాకిచ్చింది. హ్యాట్రిక్ వరల్డ్ కప్ సాధించకుండా అడ్డుకుంది.
అనూహ్య ప్రదర్శన
1983లో ఇంగ్లాండ్, వేల్స్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ కెప్టెన్సీలోని టీమిండియా అనూహ్య ప్రదర్శనతో అదరగొట్టింది. గ్రూప్- బిలో6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 ఓటములతో వెస్టిండీస్ (5 విజయాలు) తర్వాత రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. సెమీస్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్ చేరింది. అటు మరో సెమీస్ లో పాకిస్తాన్ ను ఓడించిన వెస్టిండీస్ భారత్ తో ఫైనల్ ఫైట్ కు సిద్దమైంది.
బంతి బంతికి ఉత్కంఠ..
ఫైనల్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.5 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు సునీల్ గవాస్కర్ (2: 12 బంతుల్లో), క్రిష్ణమాచారి శ్రీకాంత్ (38: 57 బంతుల్లో 7x4, 1x6)తో పాటు టాప్ ఆర్డర్ మొహిందర్ అమరనాథ్ (26: 80 బంతుల్లో 3x4), యశ్‌పాల్ శర్మ (11: 32 బంతుల్లో 1x4), సందీప్ పాటిల్ (27: 29 బంతుల్లో 1x6), కపిల్ దేవ్ (15: 8 బంతుల్లో 3x4) విలువైన పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. భారత బౌలర్ల ధాటికి విండీస్ కేవలం 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. సర్ వివ్ రిచర్డ్స్ (33: 28 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో మదన్‌లాల్, మహీందర్ అమరనాథ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బల్విందర్ 2, రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ తీశారు. మదన్‌లాల్ బౌలింగ్‌లో వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ని కపిల్‌దేవ్ పట్టడం మ్యాచ్‌లో హైలెట్.
అంచనాలను మించి.. అడ్డంకులను దాటి..అనూహ్య ప్రదర్శనతో క్రికెట్లో భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది ఇదే రోజు. భారత క్రికెట్లో ఈ విజయం మరుపురాని ఘట్టం. క్రికెట్‌కు ఆదరణ పెంచిన విజయానికి నేటికి 40 ఏళ్లు. ఈ సందర్భంగా 1983 ప్రపంచకప్ విజేత ఆటగాళ్లను అదానీ గ్రూ సత్కరించింది. మరోవైపు ఈ ఏడాది కూడా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అది సొంత గడ్డపై జరగనుండటంతో..మరోసారి భారత్ విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.