![సిక్కుల ఊచకోత కేసులో దోషిగా మాజీ ఎంపీ సజ్జన్.. నిర్ధారించిన ఢిల్లీ హైకోర్టు](https://static.v6velugu.com/uploads/2025/02/1984-anti-sikh-riots-case-former-congress-mp-sajjan-kumar-convicted-for-killing-father-son-in-delhi_I6yJRqOv8p.jpg)
- ఈ నెల 18న శిక్షపై వాదనలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు చెప్పింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సజ్జన్‌కుమార్‌ను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. అతడిని దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అయితే, శిక్ష ఖరారుపై వాదనలను ఈ నెల 18కి వాయిదా వేశారు.
సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా1984 నవంబర్1న నార్త్ వెస్ట్‌ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో జస్వంత్‌సింగ్, ఆయన కొడుకు తరుణ్దీప్సింగ్ హత్యలో సజ్జన్కుమార్ప్రమేయం ఉన్నట్టు అభియోగాలున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేశారు. అనంతరం ఈ కేసుపై సిట్ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. మరోవైపు.. 2021 డిసెంబర్ 16న సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం..
ప్రాసిక్యూషన్ ప్రకారం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద సమూహం మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, ఆస్తుల ధ్వంసం, ఇండ్ల దహనాలకు పాల్పడింది. ఈ క్రమంలోనే సరస్వతి విహార్ ప్రాంతంలో ఓ అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చినట్టు జస్వంత్ భార్య కంప్లయింట్ చేసింది. అయితే.. సజ్జన్ కుమార్ ఈ అల్లర్లలో పాల్గొనడమే కాకుండా ఆ గుంపుకు నాయకత్వం వహించాడని కోర్టు పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది.
కఠినంగా శిక్షించాలి: బాధిత కుటుంబం
కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌ను కోర్టు దోషిగా తేల్చడాన్ని బాధిత కుటుంబం, సిక్కు నాయకులు స్వాగతించారు. అతడికి కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరారు. 1984 లో జరిగింది సిక్కు అల్లర్లు కాదని, సిక్కు మారణహోమం అని తెలిపారు. ‘‘సిక్కులను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకుని హత్య చేశారు. ఈ నెల 18న సజ్జన్‌కుమార్‌కు మరణశిక్ష పడాలని మేం కోరుకుంటున్నాం.
అమాయక కుటుంబాన్ని తగలబెడితే మరణ శిక్ష తప్పదని నేరస్థులందరికీ తెలియాలి’’ అని అన్నారు. అతడికి ఉరిశిక్ష పడ్డప్పుడే న్యాయం గెలిచినట్టని పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్‌దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు.