కుకీ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ..ఒకరు మృతి, 25 మందికి గాయాలు

కుకీ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ..ఒకరు మృతి, 25 మందికి గాయాలు


ఇంఫాల్/న్యూ ఢిల్లీ:కుకీ, మైతీయ వర్గాల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్​లో శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ‘ఫ్రీ మూమెంట్’ మళ్లీ టెన్షన్ సృష్టించింది. తమకు ప్రత్యేక పరిపాలన లేదా అసెంబ్లీతో కూడి కేంద్ర పాలిత ప్రాంతం కావాలని డిమాండ్ చేస్తున్న కుకీల తెగలు ఈ ‘ఫ్రీ మూమెంట్’​ను  వ్యతిరేకిస్తూన్నాయి. ‘ఫ్రీ మూమెంట్’లో భాగంగా ప్రారంభమైన ప్రజా రవాణా బస్సులను కుకీల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అడ్డుకున్నారు. వాహనాలపై రాళ్లు రువ్వడం, రోడ్లు తవ్వడం, టైర్లు తగలబెట్టడం, బారికేడ్లు వేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో పలు చోట్ల భద్రతాదళాలు, కుకీ నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్​పోక్పీ, సేనాపతి జిల్లాలో బస్సు ప్రయాణాలు కొనసాగకుండా రోడ్లపై వేసిన అడ్డంకులను, పెట్టిన బారికేడ్లను ల్యాండ్​మైన్​నిరోధక వాహనంతో పక్కకు తోసివేసి వెళ్లారు. ఈ సందర్భంగా కుకీ నిరసనకారులు భద్రతాదళాలతో ఘర్షణకు దిగారు. బలగాలు లాఠీచార్జ్, టీయర్​గ్యాస్​తో చెదరగొట్టాయి. కీతెల్​పాన్బీలో జరిగిన ఘర్షణలో లాల్ గౌ తాంగ్ సింగిత్గా అనే యువకుడు మృతిచెందాడు. ఘర్షణల్లో బుల్లెట్ తగిలిన సింగిత్గాను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని పోలీసులు తెలిపారు. అలాగే 25 మంది గాయపడ్డారు. 

మైతేయిల ‘పీస్​ మార్చ్’ నిలిపివేత 

ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో మైతేయిలు శనివారం నిర్వహించ తలపెట్టిన ‘పీస్​ మార్చ్’ ను పోలీసులు నిలిపివేశారు. ఇంఫాల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెక్మై వద్ద ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ చేపట్టిన శాంతి కవాతును భద్రతా దళాలు అడ్డుకొని, ప్రభుత్వ ప్రారంభించిన ఫ్రీ మూమెంట్​లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో ప్రయాణించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్​ టి. మణిహార్ మాట్లాడుతూ.. ఫ్రీ మూమెంట్​ అంటే ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణించడం అని రాష్ట్రంలో శాంతి స్థాపించడమే తమను ఉద్దేశమని.. తమను సొంత వెహికల్స్​లో వెళ్లనివ్వాలని పట్టుబట్టారు. ప్రజల కదలికలను నియంత్రిస్తూ రాష్ట్రంలో ఫ్రీ మూమెంట్ అని ప్రకటించడం ఎందుకని ప్రశ్నించారు.