రాజన్న సిరిసిల్ల/తంగళ్లపల్లి, వెలుగు:-తంగళ్లపల్లి మండలం తాడూరులో ఆక్రమణకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్లు రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామం సర్వే నంబర్ 545/1---/1/3 లో గల 2 ఎకరాలు 2018లో లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ పేరు మీదకు మారిందని, దీంతో ఆమె ఇప్పుడు ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు.
జిల్లాలో ఆక్రమణకు గురైన భూములను తిరిగి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని ఈ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉన్న రైతులకు రైతు బంధు, ఇతర పథకాలు లబ్ధి పొందినా ఆ సొమ్మును రికవరీ కోసం నోటీసులు ఇస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితాలు రెడీ
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్జాబితాలు తయారు చేశామని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా తెలిపారు. ఈ జాబితాలో టీచర్లు 874 మందితో, 21,614 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారన్నారు.
టీచర్ ఎమ్మెల్సీకి సిరిసిల్ల జిల్లాలో 633 మంది పురుషులు, 241 మంది మహిళలు మొత్తం 874 మందితో తుది జాబితా తయారు చేసినట్లు చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 13,290 మంది పురుషులు, 8324 మంది మహిళలు మొత్తం 21,614 మంది తుది జాబితా తయారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.