మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. కదులుతున్న కారులో మైనారిటీ వర్గానికి చెందిన యువకుడిపై కొంతమంది యువకులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు, దాడికి పాల్పడిన వారు గ్వాలియర్ జిల్లాలోని దాబ్రా పట్టణానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు.
ఈ వైరల్ వీడియోలో బాధితుడిని ఓ వ్యక్తి చాలాసార్లు చెప్పుతో కొట్టినట్లు చూపిస్తుంది. అతను కదులుతున్న వాహనంలో "గోలు గుర్జార్ బాప్ హై" (గోలు గుర్జర్ తండ్రి) అని చెప్పమని బలవంతం చేశాడు. బాధితుడు ఆ వ్యక్తిని బలవంతం చేసిన తర్వాత అతని అరికాళ్ళను నొక్కడం కనిపిస్తుంది. నిందితుడు బాధితుడి ముఖంపై పదేపదే కొట్టడం, మాటలతో దుర్భాషలాడడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. మరో వీడియో క్లిప్‌లో, నిందితుడు బాధితుడి ముఖంపై చెప్పులతో చాలాసార్లు కొట్టడం కనిపిస్తుంది.
ఇద్దరు నిందితులు అరెస్ట్
ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. "జూలై 7న సాయంత్రం ఒక వ్యక్తిని వాహనంలో కొట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో క్లిప్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతున్నట్లు" దబ్రా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) వివేక్ కుమార్ శర్మ తెలిపారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై సంబంధిత నిబంధనల ప్రకారం అపహరణ, కొట్టినందుకు కేసు నమోదు చేసినట్లు శర్మ చెప్పారు.
ఈ వారం ప్రారంభంలోనే రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో ఒక గిరిజన యువకుడిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు చూపించే ఒక వీడియో... దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో నిందితుడు ప్రవేశ్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.