
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దాదాపు 800 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. రోహిణిలోని సెక్టార్ 17లోని జుగ్గీ క్లస్టర్‌లో ఆదివారం ఉదయం ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలం నుంచి కాలిపోయిన పిల్లల డెడ్‌బాడీల అవశేషాలను వెలికితీసి ఆస్పత్రికి పంపించారు.
ఐదు ఎకరాలలో విస్తరించి ఉన్న 800 కు పైగా గుడిసెలను మంటలు దహించి వేశాయి. మంటలు ఒక గుడిసె నుంచి ప్రారంభమై కొద్ది టైంలోనే మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయని అగ్నిమాపక శాఖఅధికారులు తెలిపారు. ఆ ప్రాంతం ముందు సరిహద్దు గోడలతో కూడిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ఉందని, దీని వల్ల అక్కడికి చేరుకోవడం చాలా కష్టంగా మారిందని వారు చెప్పారు.