కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన దంపతులను ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామ పంచాయతీ హనుమాన్తండాకు చెందిన లునావత్కృష్ణ, అర్చన దంపతులు తరచూ గొడవ పడేవారు. కుటుంబ కలహాలతో ఇద్దరూ పురుగు మందు తాగారు. బంధువులు గమనించి వారిరువురిని హుటాహుటిన కొత్తగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. దీంతో చేసేదేమీ లేక ఉప్పు నీరు తాగించి దంపతులను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.