- ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు : చిట్టీల పేరుతో రూ.2 కోట్ల 65 లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందిన మాలినేని సీతారామయ్య తన అల్లుడు మురళీకృష్ణతో కలిసి స్థానికంగా సోమశేఖర ఫిన్కార్ప్పేరుతో చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు, 30 ఏండ్లుగా చిట్టీల నడుపుతుండడంతో స్థానికంగా ఉండే సుమారు 200 మంది లక్ష, రెండు లక్షలు, ఐదు లక్షలు, పది లక్షల స్కీమ్లలో చేరారు. అయితే జులైలో తన కంపెనీని క్లోజ్ చేస్తున్నట్టు సీతారామయ్య, అతడి అల్లుడు ప్రకటించారు.
అయితే అప్పటికే వాళ్ల దగ్గర చిట్టీలు కట్టిన వాళ్ల పైసలు రూ.2 కోట్ల 65 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. వీటి కోసం చిట్టీలు కట్టిన వాళ్ల నుంచి ఒత్తిడి వస్తుండంతో కొద్దిరోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సీతారామయ్యను కృష్ణా జిల్లా నందిగామ వద్ద అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించి కోర్టులో హాజరుపరిచారు.