న్యూఢిల్లీ: పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు రానున్న ఐదేండ్లలో గ్రామీణ నిరుపేదలకు 2 కోట్ల ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద అర్హులైన వారందరికీ ఇండ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్’ కరోనా కాలంలోనూ కొనసాగిందని ఆమె చెప్పారు. 3 కోట్ల ఇండ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేండ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
మొత్తం 2 కోట్ల ఇండ్లను నిర్మించనున్నట్లు వివరించారు. గడిచిన పదేండ్లలో మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఇల్లు, నీరు, విద్యుత్ అందించడానికి కృషి చేసిందన్నారు. వంట గ్యాస్, బ్యాంక్ ఖాతా తెరిపించామని వివరించారు. ‘అందరికీ హౌసింగ్ మిషన్’ కింద.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (-అర్బన్), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- (రూరల్ లేదా గ్రామీణ) పథకాలు ఉన్నాయన్నారు.
మధ్య తరగతి ప్రజల కోసం కొత్త గృహ నిర్మాణ పథకంపై, అర్హులైన మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇల్లు కొనేందుకు లేదా కట్టుకునేందుకు గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తామని నిర్మల వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి కేంద్ర బడ్జెట్ 2023లో రూ.79,000 కోట్లు కేటాయించింది. ఇది అంతకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే 66 శాతం ఎక్కువ. ఇందులో పీఎంఏవై -అర్బన్‌కు రూ.25,103 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తం పీఎంఏవై- రూరల్ పథకానికి కేటాయించారు.