
సిరియా అట్టుడుకుతోంది. సిరియా భద్రతా దళాలు ,మాజీ అధ్యక్షుడు బషర్ అస్సాద్ మద్దతుదారులు మధ్య రెండు రోజులుగా జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు వెయ్యి మందికి పైగా మరణించారు. వీరిలో 745 మంది పౌరులు.. 125 మంది ప్రభుత్వ భద్రతా దళ సభ్యులు, 148 మంది అసద్ మద్దతు దారులు ఉన్నారు. వీధుల్లో, ఇళ్లలో ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. వాటిని తీసేందుకు భయంతో ఎవ్వరూ కూడా బయటకు రావడం లేదు.
14 సంవత్సరాల క్రితం సిరియాలో వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద ఘోరమైన హింసాత్మక ఘటన. లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాలలో విద్యుత్, తాగునీరు నిలిపివేశారు.
మాజీ అధ్యక్షుడు అసద్ అధికారం నుంచి వైదొలిగిన తర్వాత దేశాన్ని విడిచి రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే.అనంతరం తిరుగుబాటు దారులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా అసద్ మద్దతు దారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిపై దాడి చేసి పలువురిని మట్టుబెట్టారు.
అసద్ కు చెందిన అలావైట్ తెగ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు ప్రతికార దాడులకు పాల్పడ్డాయి. బనియాస్ పట్టణంలో జరిగిన ఘర్షణల్లో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.