అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

శంకరపట్నం, వీణవంక, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం అంబల్పూర్ గ్రామానికి చెందిన గొళ్లేనా సమ్మయ్య (53) రెండు ఎకరాలు సాగు చేశాడు. వ్యవసాయం కోసం అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. ఆ అప్పులు పెరిగిపోతుండటంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. 

మృతుని కుమారుడు సురేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి  చెందిన పోచాలు (45) తనకున్న వ్యవసాయ భూమిలో మక్కజొన్న, వరి సాగు చేశాడు. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. సాగుకు పెట్టిన పెట్టుబడి రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక మే 1న గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.