భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీగా గంజాయిని పట్టివేశారు. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారక్క గద్దెల వద్ద కారులో తరలిస్తున్న 25 కేజీల గంజాయిని జిల్లా ఎన్ఫోర్స్మెంట్, ఇల్లందు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి కారును సీజ్ చేశారు పోలీసులు.
నిందితులు ఒరిస్సా రాష్ట్రం మల్కన్గిరి జిల్లాకు చెందిన మహాదేవ సర్కార్, రాకేశ్ సర్దార్ గా గుర్తించారు. వీరు ఒరిస్సా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలించే క్రమంలో పోలీసులకు చిక్కారు. అయితే గంజాయి స్మగ్లర్లు సినిమా ఫక్కిలో కారు కింది భాగంలో స్టెపిన్ టైర్ లో గంజాయి పెట్టి తరలిస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు వ్యక్తులు గంజాయి వ్యాపారం చేస్తూ ఈరోజు పట్టుపడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.