భూవివాదంలో రెండు గ్రూపులు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దారుణంగా కొట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మే 9వ తేదీ గురువారం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు గ్రూపుల మధ్య భూవివాదం నెలకొంది. దీంతో ఓ వర్గం వారు కొంతమంది రౌడి మూకలను తీసుకొచ్చి.. మరో వర్గంపై దాడి చేయించింది.
దీంతో రెండు గ్రూపులు.. కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో పలువురు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. .మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. భూ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశాలించిన పోలీసులు.. గొడ్డలి, కర్రలు, కత్తి వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.