యునెస్కో, వర్కీ ఫౌండేషన్ కలిసి ఇచ్చే గ్లోబల్ టీచర్ అవార్డుకు ఇండియా నుంచి ఇద్దరు మాత్రమే పోటీలో మిగిలారు. ఆ ఇద్దరిలో ఒకరు హైదరాబాదీ టీచర్ కావడం విశేషం. ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ (దాదాపు 7,3 కోట్ల రూపాయలు) అందించే ఈ అవార్డు కోసం 121 దేశాల నుంచి 8000 నామినేషన్లు వెళ్లాయి. అందులో టాప్–50 లిస్టును ఆ సంస్థలు గురువారం ప్రకటించాయి. ఇందులో భారత్ నుంచి హైదరాబాద్‌కు చెందిన ఇంగ్లిష్, మ్యాథ్స్ టీచర్ ముసునూరి మేఘన, బీహార్‌లోని భగల్పూర్‌కు చెందిన మ్యాథ్స్ టీచర్ సత్యం మిశ్రా ఉన్నారు. మేఘనా టీచర్ విద్యా పరంగా సేవ చేయడంతో పాటు మహిళా పెట్టుబడిదారులను తయారు చేయడంలో ముందున్నారు. ఆమె ఫౌంటెయిన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ కాలేజ్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇక బీహార్ టీచర్ సత్యం మిశ్రా పిల్లల్లో మ్యాథ్స్ పట్ల ఉండే భయాన్ని తొలగించేలా కొత్త కొత్త టెక్నిక్స్‌తో టీచింగ్ చేయడంలో ఎక్స్‌పర్ట్.
గ్లోబల్ టీచర్ అవార్డులపై యునెస్కో ఎడ్యుకేషన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘రేపటి పౌరులను తీర్చిదిద్దే టీచర్లకు గ్లోబల్ టీచర్ లాంటి గొప్ప అవార్డు ఇవ్వడంలో యునెస్కో భాగస్వామ్యం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో స్ఫూర్తివంతమైన టీచర్లు, అద్భుత ప్రతిభ కలిగిన స్టూడెంట్లను గుర్తించి, వాళ్ల కమిట్‌మెంట్‌ను గౌరవించడం అవసరం. ఈ కరోనా పరిస్థితుల్లో మళ్లీ ప్రపంచాన్ని రీబిల్డ్ చేయాలంటే ప్రతి బిడ్డకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడం జన్మ హక్కుగా ప్రాధాన్యం ఇవ్వాలి. టీచర్ల మార్గదర్శకత్వంలో పిల్లలు తమ భవిష్యత్తును భద్రమన్న భరోసాతో ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు.
గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ పోటీలో నలుగురు ఇండియన్స్
కొత్తగా Chegg.org గ్లోబల్ స్టూడెంట్ అవార్డును ప్రకటిస్తున్నారు. దీనికి వచ్చిన నామినేషన్లను కూడా టాప్–50 షార్ట్ లిస్ట్ చేయగా.. అందులో ఇండియా నుంచి నాలుగురు పోటీలో మిగిలారు. ఇందులో న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో చదువుతునన్న ఆర్కిటెక్చర్ స్టూడెంట్ కైఫ్ అలీ (21), ఐఐఎం అహ్మదాబాద్ ఎంబీఏ స్టూడెంట్ ఆయూష్ గుప్తా (23), జార్ఖండ్‌కు చెందిన 17 ఏండ్ల స్టూడెంట్ సీమా కుమారి, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 24 ఏండ్ల విపిన్ కుమార్ శర్మ ఉన్నారు. 94 దేశాల నుంచి 3500 మది నామినేట్ అయితే అందులో 50 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ అవార్డు విన్నర్‌కు రూ.73 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు.
నవంబర్‌లో ప్యారిస్ వేదికగా అవార్డులు
ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేసిన టాప్–50లో నుంచి వచ్చే నెలలో పది మందిని గ్లోబల్ టీచర్ ప్రైజ్ అకాడమీ, గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ అకాడమీలు ఫైనలిస్టులుగా ఎంపిక చేస్తాయి. రెండు కేటగిరీల్లోనూ చివరికి ఒకరి చొప్పున విన్నర్‌ను ప్రకటిస్తారు. ఈ ప్రైజ్‌లను నవంబర్‌లో పారిస్ వేదికగా జరిగే అవార్డుల వేడుకలో అందజేస్తారు.