మరో ఇద్దరు భారతీయులను ఉరి తీసిన దుబాయ్ : లిస్టులో మరో 25 మంది

మరో ఇద్దరు భారతీయులను ఉరి తీసిన దుబాయ్ : లిస్టులో మరో 25 మంది

UAE.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మరో ఇద్దరు భారతీయులను ఉరి తీసింది అక్కడి ప్రభుత్వం. 2025, మార్చి 5వ తేదీ ఈ ఉరిశిక్షను అమలు చేసింది. వీళ్లిద్దరూ భారతీయులే.. కేరళ రాష్ట్రానికి చెందిన వారు. ఈ మేరకు భారత విదేశీ మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చారు యూఏఈ అధికారులు. ఉరి తీసే ముందు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు అక్కడి అధికారులు. 

యూఏఈలో ఉరి శిక్ష విధించబడిన వారు కేరళ రాష్ట్ర కన్నూర్ కు చెందిన వారు. వీరిలో ఒకరు మహమ్మద్ రినాష్, మరొకరు మురళీధరన్ గా స్పష్టం చేశారు అధికారులు.
మహమ్మద్ రినాష్ అల్ అయిన్ లోని ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం కోసం కేరళ నుంచి వెళ్లాడు. యూఏఈ జాతీయుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. విచారణ తర్వాత హత్య కేసులో రినాష్ నిందితుడి అని కోర్టు నిర్థారించింది. యూఏఈ చట్టాల ప్రకారం ఉరి శిక్ష విధించింది కోర్టు. ఆ మేరకు ఉరి శిక్ష అమలు చేశారు అక్కడి అధికారులు.
ఇక మురళీధరన్ విషయానికి వస్తే.. యూఏఈలోనే నివాసం ఉంటున్న ఓ భారతీయుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. విచారణ తర్వాత నేరం నిర్థారణ కావటంతో.. మురళీధరన్ కు మరణ శిక్ష తీర్పు వెల్లడించింది కోర్టు. ఈ మేరకు యూఏఈలోని అధికారులు ఉరి తీశారు. 

ALSO READ | నా కూతురు ఇలాచేస్తుందనుకోలే.. నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్పై కర్నాటక డీజీపీ రెస్పాన్స్

వీళ్లద్దరికీ భారత్ తరపున చట్టపరంగానూ, న్యాయపరంగానూ సాయం అందించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ఎఫెర్స్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగే రినాష్, మురళీధరన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వీళ్లిద్దరి కుటుంబ సభ్యులకు విదేశీ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత్ అధికారులు వెల్లడించారు. 

మరో షాకింగ్ విషయం ఏంటంటే.. యూఏఈలో కోర్టులు మరణ శిక్ష విధించిన వారిలో మరో 25 మంది భారతీయులు ఉన్నారు. మొన్నటికి మొన్న 2025 మార్చి 3వ తేదీన ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళను ఉరి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు.. మరో 25 మంది ఈ లిస్టులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.