
- గుండ్రాంపల్లిలో వైరస్.. 2 లక్షల కోళ్లను పూడ్చిన అధికారులు
- ల్యాబ్‌కు మరికొన్ని కోళ్ల శాంపిల్స్
- 5 కిలోమీటర్ల మేర రెడ్ జోన్
- రాష్ట్రంలో నమోదైన 3 కేసులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే..
- ఆందోళనలో పౌల్ట్రీ యజమానులు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాపై బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత నెలలో వైరస్ ఉధృతితో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కోళ్లు ఫ్లూ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పౌల్ట్రీ ఫారంల యాజమానులకు సూచనలు చేసింది. ఆ సమయంలో చికెన్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. అయితే, కొన్ని రోజులకే వైరస్ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్రంలో యథా పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో వరుసగా బర్డ్ ఫ్లూ కేసులు బయట పడుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన 3 వైరస్ కేసులు ఇక్కడి నుంచే కావడంతో అటు చికెన్ ప్రియులు, ఇటు పౌల్ట్రీ ఫారాల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు.
గుండ్రాంపల్లిలో 20 వేల కోళ్లకు వైరస్..
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులోని కోళ్ల ఫారంలో 2 లక్షల కోళ్లు ఉండగా 20 వేల కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో, శనివారం మిగతా కోళ్లను కూడా చంపి, ఫారం ఆవరణలోనే గోతి తీసి, పాతిపెట్టారు. గుండ్రాంపల్లితో పాటు చుట్టు పక్కల అన్ని కోళ్ల ఫారాలకు వెళ్లి, పరీక్షలు చేయనున్నట్లు పశు సంవర్ధక శాఖ జేడీ రమేశ్తెలిపారు. వైరస్ నిర్ధారణ అయిన ఫారం చుట్టుపక్కల 5 కిలో మీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
నేలపట్లలో తొలి కేసు..
నెల రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో రాష్ట్రంలోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదవడంతో అధికారులు పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులను అప్రమత్తం చేశారు. సరిగ్గా నెల రోజుల తర్వాత భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఓ ఫారంలో కూడా కోళ్లకు వైరస్సోకినట్లు గుర్తించారు. ఈ నెల12న ఇదే గ్రామంలోని మరో ఫారంలో 500 కోళ్లు మృతి చెందాయి. యజమాని ఇచ్చిన సమాచారంతో పశువైద్యాధికారులు చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్‌లోని హై సెక్యూరిటీ వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్ పాజిటివ్అని వచ్చింది. దీంతో, 40 వేలకు పైగా కోళ్లను చంపి, పాతిపెట్టారు. సదరు కోళ్ల ఫారాన్ని శానిటైజ్ చేసి, 3 నెలల వరకు సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
హైదరాబాద్కురికార్డు స్థాయిలో చికెన్..
ఉమ్మడి జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. హైదరాబాద్ కు రికార్డు స్థాయిలో చికెన్ సప్లై అవుతుంది. కానీ, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో నెల రోజులుగా చికెన్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. రంజాన్ మాసం కావడంతో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ సమయంలో మళ్లీ వైరస్ కేసులు బయట పడుతుండటంతో పౌల్ట్రీ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.