- పోలేపల్లి సెజ్‌లో నీళ్ల దందా
- అగ్రికల్చర్ బోర్ల నుంచి ఫార్మా కంపెనీలకు నీటి సరఫరా
- దందా చేస్తున్న వారికి అధికారపార్టీ నియోజకవర్గ లీడర్ అండ..
- ఒక్కో ట్యాంకర్‌కు నెలకు రూ.2 లక్షల కాంట్రాక్టు
- నిబంధనలు పాటించకున్నా..చర్యలు నిల్..
- ఆరు నెలల కింద అధికారులతో కమిటీ వేసినా దాడులు లేవ్
మహబూబ్‌నగర్, వెలుగు : పోలేపల్లి సెజ్ శివారు గ్రామాల్లో వాటర్ మాఫియా చెలరేగుతోంది. అధికారపార్టీకి చెందిన లీడర్ల అండతో వ్యవసాయ బోర్లను చెరబట్టి ఫార్మా కంపెనీలకు నీళ్లమ్ముతూ కోట్లు సంపాదిస్తోంది. అక్రమార్కులు రైతులకు డబ్బులు ఎర చూపి గ్రౌండ్ వాటర్‌ను ఖాళీ చేస్తున్నారని సమీపగ్రామాల ప్రజలు వాపోతున్నారు. యాసంగికి నీళ్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 5,600 ఎకరాల వ్యయసాయ భూమి ఉండగా వానాకాలంలో వరి, మక్క , పత్తి, జొన్న , కంది పంటలు రైతులు సాగు చేస్తారు. యాసంగిలో వరి, మక్క, పల్లీ వేస్తారు. ఈ పంచాయతీ పరిధిలో 1,200 బోర్లు ఉండగా, భూగర్భ జల శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక్క పోలేపల్లిలోనే 312 బోర్లు ఉన్నాయి. ఇక్కడి సెజ్‌లో 40 పరిశ్రమలు ఉండగా, అందులో 25 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీల్లో బోర్లు ఉన్నా హార్డ్నెస్ ఎక్కువగా ఉండటంతో, ఆ నీళ్లు మెడిసిన్ తయారీకి పనికొస్తలేవని కంపెనీల నిర్వాహకులు జడ్చర్లకు చెందిన ఓ నియోజకవర్గ స్థాయి లీడర్‌తో టై అప్అయ్యారు. ఆయన అండతో ఇక్కడి గ్రామాల లీడర్లతో సెజ్ చుట్టూ ఉన్న వ్యవసాయ బోర్లను టెస్టు చేయించి, మంచిగున్న బోర్ వాటర్‌ను సెలెక్ట్ చేశారు. ఆ బోర్ల నుంచి రోజూ ఫార్మా కంపెనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసేందుకు ఇల్లీగల్‌గా నీళ్ల వ్యాపారం నడిపిస్తున్నారు.
ప్రతి నెలా లక్షల్లో ఇల్లీగల్ బిజినెస్
నియోజకవర్గ స్థాయి లీడర్ అభయంతో పోలేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 8 మంది అధికార పార్టీ లీడర్లు, ముదిరెడ్డిపల్లి, రాయపల్లి గ్రామానికి చెందిన మరికొంత మంది లీడర్లు5 వేల లీడర్ల సామర్థ్యం ఉన్న సెకండ్ హ్యాండ్ వాటర్ ట్యాంకర్ల 78 కొన్నారు. రోజూ అగ్రికల్చర్ బోర్ల నుంచి కంపెనీలకు నీటిని తరలిస్తున్నారు. ఒక ట్రిప్పుకు రూ.1,500 చెల్లిస్తున్నారు. కొందరు గుండు గుత్తగా నెలకు రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా నీళ్లను తరలిస్తూ ప్రతి నెల లక్షల్లో అక్రమంగా సంపాదిస్తూ, రైతులకు ఒక ట్రిప్పుకు రూ.300 చెల్లిస్తున్నారు.
యాసంగి పంటలకు నీళ్లు ఉంటల్లేవ్
ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో గ్రౌండ్ వాటర్ఫుల్గా ఉంది. ఒక్కో ట్యాంకర్ ద్వారా రోజుకు రెండు, మూడు ట్రిప్పులు తరలిస్తున్నారు. కానీ, జనవరి, ఫిబ్రవరి వచ్చే సరికి గ్రౌండ్ వాటర్ లెవల్ పూర్తిగా తగ్గిపోతోంది. ట్యాంకర్లకు నీటిని నింపేందుకు ఒప్పందం చేసుకున్న బోరు పక్కనున్న మరో బోరులో నీళ్లు రావడం లేదు. ఈ టైంలో ఆ బోరు మీద ఆధారపడి ఉన్న పంటకు నీళ్లు చాలక ఎండబెట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీద ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు.
కరెంట్ పోతే నీళ్ల స్టోరేజ్ కోసం పాం పాండ్లు
ఉపాధి హామీ పథకం కింద రైతుల పొలాల్లో పాం పాండ్లను ఏర్పాటు చేస్తారు. కానీ, ఇక్కడ నీళ్లను స్టోరేజ్ చేసేందుకు రైతుల పొలాల్లో లీడర్లు నీటి తొట్లు కట్టించారు. రెండు మీటర్లు లోతు తవ్వి స్క్వయర్షేప్లో 5వేల లీటర్ల నీరు పట్టేంత గుంతలను తవ్వారు. నీళ్లు ఇంకిపోకుండా చుట్టూ ప్లాస్టిక్ కవర్లను ఏర్పాటు చేశారు. కరెంటు పోతే నీటికి ఇబ్బంది రాకుండా, ముందుగానే ఈ గుంతలో నీళ్లను స్టోర్ చేసి పెడుతున్నారు. కరెంటు లేని టైమ్‌లో ట్యాంకర్‌తో నీళ్లను తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు.
కమిటీ ఎక్కడుంది?
కొన్ని నెలల కింద గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ బోర్ల నుంచి ఫార్మా కంపెనీలకు నీటిని తరలిస్తున్నారని కలెక్టర్‌కు కంప్లైంట్ చేశారు. స్పందించిన ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డీపీవో, డీడీ గ్రౌండ్ వాటర్, ఆర్డీవోలతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఆరు నెలల కింద ఒకసారి వ్యవసాయ బోర్లను పరిశీలించి కొన్ని బోర్లను సీజ్ చేసింది. ఆ తర్వాత తిరిగి చూడలేదు. దీంతో మళ్లీ ఈ వ్యాపారాన్ని రెండు నెలలుగా లీడర్లు స్టార్ట్ చేశారు. అయినా ఎవరూ
స్పందించడం లేదు.
వాల్టాచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం
అగ్రికల్చర్ బోర్లను సాగునీటికే వాడాలి. కమర్షియల్‌గా వాడుకోవడానికి వీల్లేదు. అది వాల్టా చట్టానికి విరుద్ధం. ఆరు నెలల కింద పోలేపల్లిలో పర్యటించి 13 బోర్లను సీజ్ చేశాం. అక్రమంగా బోర్‌వాటర్ కంపెనీలకు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. పంచాయతీ సెక్రటరీలు ఈ విషయంపై ఫోకస్ చేయాలని ఆదేశించాం.
- రాజేందర్ కుమార్,
డీడీ, భూగర్భ జల శాఖ, పాలమూరు