2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

బషీర్ బాగ్/షాద్ నగర్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం జాబ్​క్యాలెండర్ అమలు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​చేశారు. రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఆఫీస్​ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్​మోసం చేసిందని నిరుద్యోగులంతా కలిసి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు. 

అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్​చేశారు. గ్రూప్–2 పోస్టులను పెంచి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో కొందరు ఏబీవీపీ నాయకులు ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్​చేసి స్టేషన్​కు తరలించారు. ముట్టడిలో ఏబీవీపీ నాయకులు జీవన్, మహేశ్, రాజు, పృథ్వి, శ్రీనాథ్, కల్యాణి, గణేశ్, ధృహన్, మనీషా, ప్రతీక్ తదితరులు పాల్గొన్నారు.

షాద్​నగర్ లో.. 

కాంగ్రెస్​ప్రభుత్వం బీఆర్ఎస్​ను ఫాలో అవుతోందని, నిరుద్యోగులను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్​రెడ్డి విమర్శించారు. మంగళవారం షాద్ నగర్ లో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. తహసీల్దార్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా పదవీకాలాన్ని గడిపేస్తుందని విమర్శించారు. గ్రూప్–2, 3, డీఎస్సీ పోస్టులు పెంచాలని డిమాండ్​చేశారు.