న్యూఢిల్లీ: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు లక్షల కిరాణా షాపుల షటర్లు గత సంవత్సరంలో మూతపడ్డాయి. నిమిషాల వ్యవధిలో డెలివరీ ఇచ్చే క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫారాల కారణంగా ఇవి కస్టమర్లకు దూరమయ్యాయని ఆలిండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ మార్కెట్ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం, వినియోగదారులు ఎక్కువగా బ్లింకిట్, జెప్టో వంటి ఫాస్ట్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల వైపు మొగ్గు చూపడంతో గత సంవత్సరంలో లక్షలాది కిరాణాలు స్టోర్లు, చిన్న రిటైల్ ఔట్లెట్లు మూతపడ్డాయి. మన దేశంలో కిరాణా సామగ్రి, వ్యక్తిగత సంరక్షణ వస్తువులను విక్రయించే షాపులు 1.3 కోట్ల వరకు ఉంటాయి.
మెట్రోల్లోని 17 లక్షల స్టోర్లలో 45శాతం షాపుల షటర్లకు తాళాలు పడ్డాయి. టైర్ 1 నగరాల్లోని 30 శాతం దుకాణాలు, టైర్ 2–-3 నగరాల్లోని 25శాతం షాపులు బందయ్యాయి. టైర్ 1 నగరాల్లో ఒక్కోషాపుకు రూ. 3.5 లక్షల విలువైన అమ్మకాలు ఉంటాయి. క్విక్ కామర్స్‌తోపాటు ఆర్థిక మందగమనం కిరాణా స్టోర్లను దెబ్బకొట్టాయని ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ అన్నారు. క్విక్‌కామర్స్ సంస్థలు అడ్డగోలుగా డిస్కౌంట్లు ఇస్తూ అనైతిక వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు.
త్వరలో కేంద్రానికి నివేదిక
దేశంలోని నాలుగు లక్షల రిటైల్ పంపిణీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐసీపీడీఎఫ్.. కిరాణాలను కాపాడేందుకు కేంద్రం జోక్యాన్ని కోరుతోంది. ఫెడరేషన్ తన నివేదికను రాబోయే కొద్ది రోజుల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలకు సమర్పించాలని భావిస్తోంది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్‌ఫారమ్‌లలో కొందరు విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యాంటీట్రస్ట్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు సీసీఐ విమర్శించిన నేపథ్యంలో ఫెడరేషన్ఈ ప్రకటన చేసింది.
క్విక్‌కామర్స్ సంస్థలు -జోమాటో, బ్లింకిట్, స్విగ్గి ఇన్‌స్టామార్ట్, జెప్టో- అందిస్తున్న అడ్డగోలు ధరలపై దర్యాప్తు చేయాలని సీసీఐని కోరింది. అనేక ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ సంస్థలతో చేతులు కలిపాయని, క్విక్ కామర్స్ కంపెనీల విస్తరణను అడ్డుకోకుంటే కిరాణాలను కాపాడుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సమస్యపై స్పందించారు. ఈ–కామర్స్ ప్లేయర్‌ల దోపిడీ ధరల వ్యూహాల వల్ల నష్టపోతున్న వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షించడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు.