భద్రాద్రి భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు సిద్ధం.. ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ అన్నమహాప్రసాదం

భద్రాద్రి భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు సిద్ధం.. ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ అన్నమహాప్రసాదం
  • అందరికీ అన్నప్రసాదం అందజేస్తాం
  • రామాలయం ఈవో రమాదేవి వెల్లడి

భద్రాచలం, వెలుగు: ఈ నెల 31 నుంచి జనవరి 20 వరకు జరిగే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. బుధవారం చిత్రకూట మండపంలో మీడియాతో మాట్లాడారు. తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామని, ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ అన్నమహాప్రసాదం అందిస్తామని తెలిపారు. వసతి సమస్య ఉన్న మాట వాస్తవమేనని, ఉన్న దాంట్లోనే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక వసతి కల్పిస్తున్నామని చెప్పారు.

భక్తులకు దర్శనం, ప్రసాదం ప్రధానమైనవని, వీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఖర్చుకు వెనుకాడడం లేదన్నారు. 31 నుంచి పగల్​పత్​ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అవతారాలు ఉంటాయని, ఈ రోజుల్లో భక్తుల కోసం వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు గోదావరి తీరాన వేదికపై భక్తులకు జిల్లా సంస్కృతిని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

స్టాల్స్  ఏర్పాటు చేసి ఆదివాసీ గూడేల్లో దొరికే ఆహార పదార్థాలు, ఔషధ మూలికలు, అటవీ ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జనవరి 9న తెప్పోత్సవం, 10న తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం, 26న విశ్వరూప సేవలు ఉంటాయని చెప్పారు. ఈ నెల 31 నుంచి జనవరి 10 వరకు నిత్య కల్యాణాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. సమావేశంలో ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, రామస్వరూపాచార్యులు, ఏఈవో భవానీ రామకృష్ణ, ఈఈ రవీందర్​రాజు పాల్గొన్నారు.