ప్రతి రోజు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలె

 

  • జీఎంలకు సింగరేణి సీఎండీ బలరాం నాయక్  ఆదేశం

కోల్​బెల్ట్, వెలుగు:  ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్​ను చేరుకోవడానికి ప్రతి రోజు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే స్థాయిలో కోల్​ట్రాన్స్​ఫోర్ట్​ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్​ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్  సింగరేణి భవన్  నుంచి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో ఉత్పత్తి, కొత్త ప్రాజెక్టులు, అడ్రియాల లాంగ్ వాల్  ప్రాజెక్టు, ఇతర విషయాలపై వీడియో కాన్ఫరెన్స్  ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 రోజుకు 2 లక్షల బొగ్గు ఉత్పత్తికి 13 లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​బర్డెన్(మట్టి) వెలికితీయాల్సి ఉందన్నారు. వర్షాకాలంలో ఉత్పత్తికి ఆటంకాలు ఎదురుకాకుండా హాల్​రోడ్లను పటిష్ట పర్చుకోవాలని, క్వారీల్లో నిలిచిన వరద నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్​ చేయాలన్నారు. ఏదైనా షిప్ట్​లో ఉత్పత్తి తగ్గితే తరువాతి షిప్టులో భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకోవాన్నారు. టార్గెట్​ పూర్తి చేసేందుకు అన్ని ఏరియాలకు అవసరమైన యంత్రాలను, ఓవర్  బర్డెన్​ తొలగించడానికి ఏజెన్సీల నియామకం పూర్తి చేశామన్నారు. రానున్న ఐదేండ్లలో 100 మిలియన్  టన్నుల టార్గెట్​ చేరుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుందని, మరో ఐదేండ్లలో 10 కొత్త బొగ్గు గనులను ప్రారంభించాల్సి ఉందన్నారు. 

మరో 3 నెలల్లో ఒడిశాలోని సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్​ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని ధీమా వ్యక్తంచేశారు. గనులకు సంబంధించిన పర్మిషన్లు, ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణి డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు(ఈఎం), ఎన్వీకే శ్రీనివాస్​(ఆపరేషన్స్, పర్సనల్), జి.వెంకటశ్వర్​రెడ్డి(ప్లానింగ్​అండ్​ప్రాజెక్ట్స్), జీఎంలు జి.దేవేందర్, రవికుమార్​పాల్గొన్నారు.