ప్రయాగ్​రాజ్ శివారులో 2 లక్షల వెహికల్స్

ప్రయాగ్​రాజ్ శివారులో 2 లక్షల వెహికల్స్
  • 35 కి.మీ. నడిచి త్రివేణి సంగమానికి చేరుకుంటున్న భక్తులు
  • సరిహద్దుల్లోనే వాహనాలు ఆపేస్తున్న అధికారులు
  • ఇప్పటికే సిటీలో 7 లక్షల వెహికల్స్ పార్కింగ్
  • 45 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

మహాకుంభనగర్(యూపీ): ప్రయాగ్​రాజ్ మహాకుంభ మేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇటీవల అఖాడా మార్గ్​లోని ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన అధికారులు ప్రయాగ్​రాజ్​లోకి వాహనాలను అనుమతించడం లేదు. 

దీంతో సుమారు 2 లక్షలకు పైగా వాహనాలు సిటీ శివారులోనే నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రయాగ్​రాజ్ జిల్లా అధికారులు తెలిపారు. ఈ నెల 3న వసంత పంచమి ఉండటంతో ప్రయాగ్​రాజ్​లోకి ఎంటర్ అయ్యే రోడ్లన్నీ క్లోజ్ చేశారు. సుమారు 40 నుంచి 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

 త్రివేణి సంగమానికి చేరుకోవాలంటే కనీసం 30 నుంచి 35 కిలో మీటర్లు నడవాల్సి వస్తున్నది. మౌని అమావాస్య రోజు స్నానం చేసేందుకు తరలివచ్చిన చాలా మంది భక్తులు.. ట్రాఫిక్​లో చిక్కుకుపోయారు. ప్రయాగ్​రాజ్ చుట్టూ ఉన్న ప్రతాప్​గఢ్, కౌశాంబి, భదోహి, చిత్రకూట్, జౌన్​పూర్, మిర్జాపూర్, మధ్యప్రదేశ్​లోని రేవా జిల్లా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

ప్రతాప్​గఢ్–ప్రయాగ్​రాజ్ హైవేపై సుమారు 15 వేలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్​రాజ్ సిటీలో ఏర్పాటు చేసిన 125 పాయింట్లలో 7లక్షల వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ లేకపోవడంతో సరిహద్దుల్లోనే వెహికల్స్​ను ఆపేస్తున్నారు. 

కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 5 వరకు వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్‌‌‌‌లలో నిర్వహించే గంగా హారతిని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక ప్రజలు అవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దన్నారు.

మహాకుంభ మేళాకు వచ్చిన భక్తులు.. వారణాసికి కూడా వస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 30 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

కుంభమేళా నుంచి తిరిగివెళ్తూ ఆరుగురి మృతి

పికప్ ట్రక్​ను ఓ ట్రైలర్ ట్రక్ ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయారు. ఈ ఘటన యూపీలోని వారణాసి – గోరఖ్​పూర్ హైవేపై శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. మహా కుంభ మేళాలో స్నానం చేసి తిరిగి ఇంటికెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.

మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిని ఘాజిపూర్ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ

సన్యాసినిగా మారిన నటి మమతా కులకర్ణి  కిన్నెర అఖాడా నుంచి బహిష్కరణకు గురయ్యారు. మహామండలేశ్వర్‌‌‌‌గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేస్తున్నట్లు కిన్నెర అఖాడా ఫౌండర్ రిషి అజయ్ దాస్ ప్రకటించారు. 

పలువురు మతపెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా మమతా కులకర్ణిని అఖాడాలో చేర్పించిన కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ లక్ష్మీనారాయణ్‌‌‌‌ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అజయ్ దాస్ నోట్ రిలీజ్ చేశారు.