2 లక్షల విలువైన మద్యం పట్టివేత

జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.2 లక్షల విలువైన మద్యం కాటన్​లను భీమారం వద్ద  రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్​ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్ ఇన్​స్పెక్టర్ సిబ్బందితో కలిసి భీమారం పోలీస్​స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం కాటన్​లను సీజ్​ చేశారు. మద్యం విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులు మహ్మద్ షరీఫ్, తిప్పా రమణయ్యపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

కడెం మండలంలో..

కడెం: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో బెల్ట్​షాప్​ నిర్వహిస్తున్న రాజన్న దుకాణంలో ఎస్​ఐ కృష్ణ సాగర్ రెడ్డి తనిఖీలు చేపట్టి 13.5 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆ మద్యం విలువ సుమారు రూ.11 వేలు ఉంటుందని తెలిపారు. నిర్వాహుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.