- ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు.. కొత్తగా 2.24 లక్షల దరఖాస్తులు
- ఇందులో 19,193 అప్లికేషన్లకు ఓకే.. 1,44,784 రిజెక్ట్
- 59 వేలకుపైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు
- చివరి దశకు చేరిన దరఖాస్తుల ఆన్‌లైన్ అప్లోడ్
- ఇప్పటికే 5.80 లక్షల మంది అర్హులుగా గుర్తింపు.. వారిలో 18,180 మందికి నగదు బదిలీ
- ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో మిగిలిన వారికి నిలిచిననగదు జమ
హైదరాబాద్, వెలుగు: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకంలో లబ్ధిదారుల ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. అంతకుముందు గ్రామ సభల్లో, మండల కార్యాలయాల్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఆదివారం సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది.
ఆ తర్వాత సైట్ క్లోజ్ చేస్తామని, ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని చెప్పింది. ఈ మేరకు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల డీఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని జిల్లాల్లో దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియను శరవేగంగా చేపట్టారు. అయితే, తమ సమస్యలు పరిష్కరించాలని ఇటీవల ఉపాధి హామీ సిబ్బంది మూడ్రోజులు నిరసన కార్యక్రమాలు చేశారు. దీంతో అప్లికేషన్ల ఎంట్రీకి కొంత ఆటంకం ఏర్పడింది.
కొన్ని జిల్లాల్లో దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వారికి మరో రెండ్రోజులు సమయం ఇచ్చారు. మరికొన్ని జిల్లాల్లో అప్ లోడ్ ప్రక్రియను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. కాగా, భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో రూ.6 వేల చొప్పున రూ.10.90 కోట్లకు పైగా నగదును జమ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ నిలిచిపోయింది. కాగా, 2023-–24లో ఉపాధి హామీ పథకం కింద 20 రోజుల పని దినాలు పూర్తి చేసిన వారినే ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.
మొత్తం 6 లక్షలకు పైగా లబ్ధిదారులు..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కొత్తగా ఇప్పటివరకు వచ్చిన 2,24,487 దరఖాస్తుల్లో 19,193 అప్లికేషన్లకు ఓకే చెప్పారు. పలు కారణాలతో 1,44,784 అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. ఇంకా 59,542 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారుల పరిశీలన తర్వాత ఇంకా 5 వేల నుంచి 6 వేల వరకు అర్హులు ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,80,577 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కొత్తగా మరో 25 వేల నుంచి 30 వేల మంది అర్హుల జాబితాలో చేరే అవకాశం ఉంది. మొత్తం కలిపితే 6 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ పథకానికి ఎంపిక కానున్నారు. అయితే, రాష్ట్రంలో ఐదారు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయింది.
భూమి ఉన్నోళ్లు అప్లై చేసుకున్నరు..
ఇటీవల గ్రామసభల ద్వారా స్వీకరించిన అప్లికేషన్లలో అస్సలు భూమి లేనివాళ్లు, జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకున్నారు. ఆత్మీయ భరోసా వస్తుందనే ఆశతో భూమి ఉన్నవారు సైతం అప్లికేషన్ పెట్టుకున్నారు. మరోవైపు, గతంలో భూమి అమ్ముకున్నా.. రికార్డుల్లో పేరు అలాగే ఉన్నవారిని అర్హుల జాబితా నుంచి తీసేశారు. అప్లికేషన్ల నమోదు, అర్హుల వివరాలను ప్రత్యేక ఫోర్టల్‌లో ఎంట్రీ చేస్తున్నారు. ఇందులో లబ్ధిదారుల పేరు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయగానే వీరికి భూమి ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది. భూమి ఉంటే వీరి పేరు ఆటోమెటిక్‌గా రిజెక్ట్ అయిపోతుంది. భూమి లేకపోతే అర్హుల జాబితాలో పేరు నమోదవుతుంది. గ్రామ సభల్లో ప్రదర్శించిన జాబితాపై స్వీకరించిన అభ్యంతరాల్లో అనర్హులై ఉండి, జాబితాలో పేరు ఉన్నా కూడా లిస్ట్ నుంచి తొలగించారు.
ఫ్యామిలీలో ఏ ఒక్కరికి భూమి ఉన్నా.. పేరు రిజెక్ట్..
జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా.. వారు ఆత్మీయ భరోసాకు అన్హరులుగా గుర్తిస్తారు. కుటుంబ యాజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారినీ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. పదేండ్ల క్రితం భూమి ఉండి.. తర్వాత అమ్ముకున్నా వారి పేర్లు రికార్డుల్లో అలాగే ఉండటంతో అలాంటి వారు ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేదు. అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్రంలోని ఓ వృద్ధురాలు పదేండ్ల క్రితం తన భూమిని విక్రయించింది. కానీ, ఆమె పేరు రికార్డుల్లో అలాగే ఉండటంతో ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేదు. వీరి నుంచి ప్రభుత్వం అఫ్లికేషన్లు తీసుకోనుంది.
తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి విక్రయించినా.. రెవెన్యూ రికార్డుల్లో పేరు అలాగే ఉండటానికి గల కారణాలు సర్టిఫై చేసి వివరాలు ఎంపీడీవోకు ఇవ్వాలి. ఆ తర్వాత ఎంపీడీవో అర్హులని ధ్రువీకరిస్తే వారికి ఆత్మీయ భరోసా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు అంత రిస్క్ చేయడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. మరోవైపు, కుటుంబంలోని మహిళా బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలుంటే వారిలో పెద్ద వయస్కురాలి ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. కుటుంబంలో అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద (పురుషులైనా సరే) అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. అర్హులై ఉండి భార్య చనిపోతే భర్తకు లేదా ఆ కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా వారి పేరున నగదు జమ చేయనున్నారు.