బీజాపూర్​లో ఎన్​కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల మృతి

బీజాపూర్​లో ఎన్​కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ లోని బీజాపూర్​జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బాసగూడ పరిధిలోని నేండ్ర అటవీ ప్రాంతంలో డీఆర్జీ, కోబ్రా, యంగ్​ప్లాటూన్​లతో కూడిన బలగాలు శుక్రవారం కూంబింగ్​నిర్వహించాయి. నేండ్ర- పున్నూరు అటవీ గ్రామాల మధ్య మావోయిస్టు దళాలకు, బలగాలకు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు.

వారి మృతదేహాలతో పాటు ఘటనాస్థలం నుంచి12బోర్​ సింగిల్​షాట్​ గన్​, ఒక స్వదేశీ గన్​, 5 కిలోల టిఫిన్​బాక్సు బాంబు, ప్రింటర్, విప్లవ సాహిత్యం, ఇతర నిత్యావసర సరుకులను బలగాలు స్వాధీనం చేసుకుని బాసగూడ పోలీస్​స్టేషన్​కు తరలించారు. చనిపోయినవారిని కవాసి హంగా, సోమద కల్మగా అధికారులు గుర్తించారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ లలో పలు కేసులతోపాటు లక్ష రూపాయల రివార్డ్ కూడా ఉన్నట్లు వివరించారు.

మరో వైపు.. అబూజ్​మాఢ్ ఏరియాలో గురువారం జరిగిన ఎన్​కౌంటర్ లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను బైరంగఢ్​ పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చారు. వీరిని కూడా గుర్తించాల్సి ఉంది. కేవలం రెండు రోజుల్లో 9 మంది మావోయిస్టులను బలగాలు చంపేశాయి.