ప్రకృతి పగ పట్టినట్లు.. ఒకటి తర్వాత ఒకటి.. తీరం దాటిని తర్వాత ఇంకోటి.. ఇలా వరసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 16వ తేదీ నెల్లూరు దగ్గర తీరం దాటిన వాయుగుండం.. పూర్తిగా బలహీనపడకముందే.. మరో బాంబ్ పేల్చింది వాతావరణ శాఖ.
2024.. అక్టోబర్ నెలలో.. అంటే ఈ నెలలోనే.. ఈ నెలలో మిగిలిన 14 రోజుల్లోనే సముద్రంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. అక్టోబర్ 21వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయని వెల్లడించింది. నెలాఖరులో పసిఫిక్ మహా సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వివరించింది వాతావరణ శాఖ. 21వ తేదీన ఏర్పడే ఉపరితల ఆవర్తనం.. 25వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ.
Also Read : తీరం దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సముద్రంలో ఏర్పడుతున్న ఈ రెండు అల్పపీడనాల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని వెల్లడించింది. అల్పపీడనం బలపడినట్లయితే.. ఒక వేళ దిశ మార్చుకుంటే మాత్రం మళ్లీ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాటి గమనం.. దిశ ఆధారంగా మరింత స్పష్టత వస్తుందని వివరించింది వాతావరణ శాఖ. ఈ విషయాలను IMD మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కేజే రమేష్ వెల్లడించారు.