ఏసీ గాలితో నవజాత శిశువులు మృతి

ఉత్తర్ ప్రదేశ్ షామ్లీ జిల్లాలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో సెప్టెంబర్ 24న ఇద్దరు నవజాత శిశువులు చనిపోయారు. చాలా చల్లగా ఉన్న గదిలో ఉంచిన కారణంగా వీరిద్దరూ మరణించారని పోలీసులు తెలిపారు. క్లినిక్ యజమాని డాక్టర్ నీతు.. శనివారం రాత్రి ఎయిర్ కండీషనర్ (ఏసి)లో ఉంచాలని చెప్పారని నవజాత శిశువుల కుటుంబాలు ఆరోపించాయి. మరుసటి రోజు ఉదయం శిశువులు శవమై కనిపించడంతో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు.

చిన్నారుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీతూపై ఐపీసీ సెక్షన్ 304 (హత్య చేయని నేరానికి పాల్పడినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు ఎస్‌హెచ్‌ఓ (కైరానా) నేత్రపాల్ సింగ్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఏసీఎంఓ) డాక్టర్ అశ్వనీ శర్మ ఈ సందర్భంగా తెలిపారు.

ALSO READ : బీజేపీ ఎమ్మెల్యే అపార్ట్ మెంట్ పై.. మీడియా సెల్ ఉద్యోగి ఆత్మహత్య

శనివారం కైరానాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువులు జన్మించారని, ఆ తర్వాత అదే రోజు ప్రైవేట్ దవాఖానకు తరలించారని ఫిర్యాదులో తెలిపారు. చికిత్స నిమిత్తం వారిని ఫోటోథెరపీ యూనిట్‌లో ఉంచారు. నీతు శనివారం రాత్రి ఎయిర్ కండీషనర్ స్విచ్ ఆన్ చేసిందని, మరుసటి రోజు ఉదయం యూనిట్‌లో వారి కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి పిల్లలిద్దరూ చనిపోయారని వారు తెలిపారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తూ నీతుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.